పాఠశాల తరగతి గదికి వేసిన తాళాన్ని అపరిశుభ్రం చేసిన ఆకతాయిలు మూసి ఉన్న పాఠశాల
విజయనగరం రూరల్: పట్టణ పరిధిలోని గాజులరేగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆకతాయిలు అల్లరి చేష్టలతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న రెండు పాఠశాలలకు సెలవు రోజులు వస్తే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. గ్రామానికి చెందిన ఆకతాయిలు రాత్రి సమయాల్లో పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి బహిరంగ మలవిసర్జన చేయడం, మలాన్ని పాఠశాల తలుపులకు వేసిన తాళాలకు పులమడంతో మర్నాడు పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
దీంతోపాటు పాఠశాల తరగతి భవనాల వరండాల్లోనే ఆకతాయిలు రాత్రి సమయాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వాడి పడేసిన కండోమ్‌లు, ఇతరత్రా వస్తువులతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఆకతాయిల అల్లరి పనులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలలను మూసేసి రైల్వేగేటు సమీపంలో ఉన్న పాఠశాల వద్దకు పిల్లలను తరలించి తరగతులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. పోలీసులు రాత్రి సమయాల్లో పాఠశాల వద్ద గస్తీ నిర్వహిస్తే ఆకతాయిల ఆట కట్టవచ్చని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ విషయమై పాఠశాల ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడానికి సైతం ఎందుకో వెనకడుగు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment