సాక్షి, నల్లగొండ : ‘‘ తెలంగాణ కోసం ఇప్పటికే 1100మంది బిడ్డలు బలిదానం చేశారు.. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండదు.. ప్రతి ఒక్కరూ కట్టెలు పట్టుకొని రోడ్డెక్కుతారు’’ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 7న ఏపీఎన్జీవోలు నిర్వహించతలపెట్టిన సమైక్య సభకు అనుమతిని వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఆ రోజు ఏం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలే బాధ్యత వహించాలని చెప్పారు. నల్లగొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ జేఏసీ తలపెట్టిన శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతివ్వకుండా ఐదురోజులు ముందుగానే సమైక్య సభకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణను అడ్డుకునే వారిలో మొదటి ముద్దాయి సీఎం అని, ఆ తర్వాతి స్థానం చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. సీఎం తీరుతో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత మంత్రులు తెలంగాణకు బద్దవ్యతిరేకి అయిన సీఎం చుట్టూ తిరుగుతారా? లేక పదవులను వీడి ప్రజలతో కలిసి ఉద్యమిస్తారో తేల్చుకోవాలన్నారు. ఒకసారి యూటీ అని, మరోసారి సమైక్యాంధ్ర అంటూ చిరంజీవి మరో తెలంగాణ ద్రోహిగా మారారని దుయ్యబట్టారు.
కట్టెలు పట్టుకొని రోడ్డెక్కుతారు: కోమటిరెడ్డి
Published Fri, Sep 6 2013 4:02 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement