'భోగాపురంలో ఎయిర్పోర్ట్ వద్దంటే కుదరదు'
విశాఖపట్నం: విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్పోర్ట్ వద్దంటే కుదరదని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విశాఖపట్నంలో స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో పలువురు బాధితులు మంగళవారం విశాఖపట్టణంలోని సర్క్యిట్ గెస్ట్ హౌస్‌లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు స్పందించారు.
అభివృద్ధి దృష్ట్యా ఎయిర్పోర్ట్ అవసరం అని ఆయన అఖిల పక్ష నేతలకు తేల్చి చెప్పారు. ఏం కావాలో తేల్చుకోండి అంటూ అభిప్రాయం వారికే వదిలేశారు. ఎయిర్పోర్ట్కు 5551 ఎకరాల భూమి అవసరమని గంటా ఈ సందర్భంగా గుర్తు చేశారు.అందుకోసం 7 గ్రామాల నుంచి భూమిని సేకరిస్తున్నట్లు చెప్పారు. అయితే రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించడం లేదని... రైతులే స్వచ్చంధంగా ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారని గంటా చెప్పారు. భోగాపురంలోని 5వేల ఎకరాల సాగు భూమిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.