కుటుంబసభ్యులు మందలించారని ఆత్మహత్య
తణుకు (పశ్చిమగోదావరి) : అప్పు విషయమై భార్య, కుమార్తె మందలించడంతో ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు 3వ వార్డులో నివాసం ఉంటున్న ప్రత్తిపాటి పెంటయ్య రజక వృత్తి చేసుకుంటూ.. ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎన్‌ఎంఆర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అతడు రూ.15 వేలు అప్పు చేశాడు. కాగా ఆ విషయం తెలిసి భార్య, కుమార్తె ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందని సోమవారం రాత్రి ప్రశ్నించారు.
అప్పులు చేయడం తగదని మందలించడంతో ముగ్గురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో పెంటయ్య తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మంగళవారం ఉదయం డ్యూటీకని బయలుదేరిన అతడు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్‌లో మెట్ల ప్రాంతం వద్ద గల కొక్కేనికి నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు. కొంతసేపటికి సమీపంలోని పండ్ల వ్యాపారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.