
సాక్షి, తాడేపల్లిగూడెం : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ గాయకుడు శ్రీనివాస్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట మార్చారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్‌పై నిప్పులు చెరిగారు. చిన్ననాటి నుంచి బాగా తెలిసిన వ్యక్తి కావటంతో శ్రీనివాస్‌పై ఆరోపణలను ఖండించానని ఆయన తెలిపారు. అయితే మహిళల పట్ల అతని వికృత చర్యలు చాలా బాధించాయని మంత్రి చెప్పుకొచ్చారు. గజల్ అనే నాణానికి ఇంతకాలం ఒకవైపే చూశా కానీ, రెండోవైపు కోణం చాలా జుగుప్సాకరంగా ఉందంటూ మంత్రి వ్యాఖ్యానించడం విశేషం.
కాగా, నిన్న ఇదే మాణిక్యాలరావు గజల్ చాలా మంచి వ్యక్తి అని.. అతనిపై కావాలనే కుట్ర చేశారంటూ మద్దతు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో మీడియాపైనే ఆయన చిర్రుబుర్రులాడారు కూడా.