ఒంగోలు క్రైం: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ రాష్ట్రంలోని యువతీ, యువకులను నిలువునా మోసం చేసిన సంఘటన ఒంగోలులో వెలుగుచూసిం ది. నగరంలోని మంగమూరురోడ్డు ఆశ్రమం సమీపంలో ఉన్న మాస్టర్ మైండ్స్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ కోసం వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు తమను యాజమాన్యం మోసగించిందంటూ శనివారం నిరసన తెలిపారు. ఒంగోలు కేంద్రంగా ఉన్న మాస్టర్ మైండ్స్ డిఫెన్స్ అకాడమీని ఒంగోలుకు చెందిన కేతినేని ఆంజనేయులు నడుపుతున్నారు.
డిఫెన్స్ అకాడమీ పేరుతో రాష్ట్రంలోని అన్నీ జిల్లాలు తిరిగి ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులను మిలిటరీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపి మరీ చేర్చుకున్నారు. ఇలా రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా విద్యార్థినీ, విద్యార్థులు ఇక్కడ శిక్షణ కోసం చేరారు. ఆరు నెలల శిక్షణ పూర్తయింది. అయినా ఒక్క ఉద్యోగపరీక్షకు కూడా తీసుకెళ్లకపోవడంతో ఇక్కడ శిక్షణ కోసం వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు యాజమాన్యంపై తిరగబడ్డారు.
దీంతో విషయం వెలుగుచూసింది. ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీలకు వెళ్లిన మాస్టర్ మైండ్స్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు ఉద్యోగం గ్యారంటీ అంటూ హామీ ఇచ్చి దాదాపు మొదటి బ్యాచ్‌గా 120 మందిని చేర్చుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, మెటీరియల్‌కు రూ.3 వేలు, అదనపు ఫీజుల కింద రూ.3 వేలు ముందుగానే వసూలు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు ఫీజుల రూపంలో మాట్లాడుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు ఒంగోలులో ఏర్పాటు చేసిన అకాడమీ కోసం తీసుకున్న భవనంలో వసతులు సరిగా లేవంటూ కొంత మంది ముందు కట్టిన ఫీజులు వదిలేసుకొని మరీ వెళ్లిపోయారు.
ప్రస్తుతం 60 నుంచి 80 మంది వరకు ఈ అకాడమీలో శిక్షణ కోసం చేరారు. ఆరు నెలల శిక్షణ పూర్తయింది. అయితే ఉద్యోగాలు చూపకుండా అందరినీ ఇళ్లకు వెళ్లిపొమ్మనడంతో విద్యార్థినీ, విద్యార్థులు తిరుగుబాటు చేశారు. గ్యారంటీ ఉద్యోగం పేరిట పిలిపించి దాదాపు రూ.60 నుంచి రూ.70 వేల వరకు తమకు ఖర్చయిందని, అయినా కనీసం ఒక్క ఉద్యోగ పరీక్ష కూడా రాయించకుండా ఇంటికి వెళ్లమంటే ఎలా వెళ్లాలంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. ఇంకా అకాడమీలోనే ఉండాలంటే నెలకు ఒక్కొక్కరు రూ.4 వేలు చొప్పున అదనంగా చెల్లించాలంటూ నిర్వాహకులు డిమాండ్ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థినీ, విద్యార్థులు ఆందోళనకు దిగారు.
అమ్మాయిలకు, అబ్బాయిలకు ఒకే హాస్టల్:
మాస్టర్ మైండ్స్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు తీసుకున్న ఒకే భవనంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు హాస్టల్ వసతి ఒకే చోట కల్పించారు. దాదాపు 30 మందికిపైగా విద్యార్థినీలు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే చోట హాస్టల్ వసతి ఏర్పాటు చేయటంపై కూడా ఆందోళన వ్యక్తం చేసినా దుర్భాషలాడుతున్నారని విద్యార్థినులు మీడియా ముందు వాపోయారు. డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలొస్తే ఎవరి బాత్‌రూమ్‌లు వాళ్లే శుభ్రం చేసుకోవాలని ఒత్తిడి చేసి మరీ బాత్‌రూమ్‌లు తమ చేతే శుభ్రం చేయిస్తున్నారని అబ్బాయిలు గోడు వెళ్లబోసుకున్నారు. పడుకునేందుకు కనీస సౌకర్యాలు కూడా లేవు. నేల మీదనే పడుకోవాలి. అమ్మాయిలున్న హాస్టల్ అయినా కిటికీలకు గ్రిల్స్ కూడా లేవు. ఒక్కో సందర్భంలో అమ్మాయిలున్న హాస్టల్‌లో బాత్‌రూమ్‌ల సమీపంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వేధించారని వాపోయారు.
ఇక భోజన వసతి మరీ అధ్వానం. పురుగులతో కూడిన భోజనమే తింటున్నామని విలవిల్లాడారు. తమను ఇక్కడ శిక్షణ పేరుతో తీసుకొచ్చి ఒంగోలులోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చేర్పించి ఇక్కడ శిక్షణ కాకుండా అప్పుడప్పుడూ ఆ కాలేజీకి కూడా పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చింది డిగ్రీ చదవటానికి కాదని మిలిటరీలో ఉద్యోగాల పేరిట తీసుకొచ్చి డిగ్రీలో చేర్పించి అక్కడ కూడా అదనంగా తమ చేత ఫీజులు కట్టించారని వాపోయారు. డిగ్రీ చదివే పనైతే తాము నివాసం ఉండే ప్రాంతాల్లోనే చేరే వాళ్లమని ఉద్యోగాల పేరిట తమను ఇక్కడకు తీసుకొచ్చి నిలువునా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రంగంలోకి పోలీసులు:
సమాచారం తెలుసుకున్న ఒంగోలు తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో మాస్టర్ మైండ్స్ డిఫెన్స్ అకాడమీ క్యాంపస్ వద్దకు వెళ్లారు. విద్యార్థినీ, విద్యార్థులతో మాట్లాడారు. వారి అవస్థలు విన్నారు. ఇటు యాజమాన్యం చెప్పింది కూడా విని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి, ఎస్పీ బి.సత్య ఏసుబాబు దృష్టికి తీసుకెళ్లి ఆ తరువాత విద్యార్థుల కోసం ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ పడితే పంపుతాం
మిలిటరీలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పడితే అందరినీ పంపుతాం. విజయనగరంలో నిర్వహించనున్న ఆర్మీ ర్యాలీకి దరఖాస్తు చేయడానికి సమయం కుదరలేదు. అయితే ఈ సారి ఏ నోటిఫికేషన్ పడినా దరఖాస్తు చేయించి అందరినీ పోటీలకు పంపాలని నిర్ణయించాం. మేం శిక్షణ అనుకున్న ఆరు నెలలు పూర్తయింది. తరువాత బ్యాచ్ కోసం రంగం సిద్ధం చేస్తున్నాం. విద్యార్థులు ఇంకా పూర్తిగా ఫీజులు కట్టలేదు. నూతన భవనం కాబట్టి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎవరినీ ఇబ్బంది పెట్టం. తరువాత అందరినీ తిరిగి పిలిచి పోటీ పరీక్షలకు పంపుతాం.
– కేతినేని ఆంజనేయులు, మాస్టర్ మైండ్స్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment