పల్లె సారూ.. ఆదుకోండి!
మంత్రి పల్లె కళాశాలలో పని చేస్తూ గాయపడిన కార్మికుడు
కేసు నమోదు చేయకుండా మాయమాటలు చెప్పిన అనుచరులు
ఆర్థికసాయం చేస్తామని పట్టించుకోని వైనం
న్యాయం చేయాలంటున్న
బాధిత కుటుంబ సభ్యులు
అనంతపురం మెడికల్ :రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలలో పని చేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి మంచానికే పరిమయ్యాడో యువకుడు. ప్రమాదం జరిగిన సమయంలో అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చి ఆపై పట్టించుకోక పోవడంతో ఆ యువకుడి బాధ వర్ణణాతీతం. బాధితుడు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లిలో నివాసం ఉంటున్న ఓబుళపతి (31) గత ఏడాది ఫిబ్రవరిలో కక్కలపల్లిలోని పీవీకేకే కళాశాలలో రెండో అంతస్తు ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో వెన్నెముక విరిగింది. వెంటనే కళాశాలలోని వారు అతడిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ క్రమంలో కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం ఎంత ఖర్చయినా భరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అనంతలో వెన్నెముకకు సంబంధించి శస్త్ర చికిత్స లేదని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యం అందకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎలాంటి ఆర్థికసాయం చేయకపోగా బాధితుడికి రూ.1.50 లక్షల వరకు ఖర్చయింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక ఓబుళపతిని అనంతపురం తీసుకొచ్చారు.
ఫిజియోథెరపీ చేయించినా ఫలితం లేకపోగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తల్లి సరోజమ్మ, భార్య స్నేహలత సపర్యలు చేస్తున్నారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇదివరకే అందజేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వెళ్లి ఆర్థికసాయం చేయాలని అడిగితే ఆ బిల్లులు తన వద్ద లేవని, మరోసారి ఇవ్వాలని మంత్రి చెబుతున్నట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం బిల్లు డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ బిల్లులు మూడు సార్లు ఇచ్చామని, మంత్రి మాత్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తమకు నష్టపరిహారం అందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడమని ఓబుళపతి, ఆయన భార్య స్నేహలత, తల్లి సరోజమ్మ అంటున్నారు. మంత్రి సతీమణి చెప్పడంతోనే తాను పై అంతస్తుకు ఎక్కి పనులు చేశానని, ఈ క్రమంలోనే జారిపడినట్లు ఓబుళపతి తెలిపారు.