'సినిమావాళ్ల మీద పడ్డాడు... దేవుడు'
హైదరాబాద్ : కష్టాల్లో ఉన్నప్పుడు చిత్రసీమలో ఆదుకునేవారు దిక్కుండరని క్యారెక్టర్ నటి పావలా శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయ్ కిరణ్ అకాల మరణం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడిని అధిగమించలేక..తాను కూడా ఒకప్పుడు ఆత్మహత్యనే శరణ్యమని భావించానని ఆమె అన్నారు.... ఎవరైనా సరే చనిపోయాక అయ్యో అంటారే కానీ, బతికి ఉన్నప్పుడు ఒక్కరూ అండగా ఉండరన్నారు. ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆత్మహత్య చేసుకుంటాడో అర్థం చేసుకోవచ్చన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండేవారంటే బాగుండేదన్నారు.
మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ....ఉదయ్ కిరణ్,తాను అయిదారు చిత్రాలు కలిసి చేశామన్నారు. శ్రీరాం సినిమా షూటింగ్ సమయంలో కోఠీలో షూటింగ్ సమయంలో తన ఇంట్లో ఉండేవాడన్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారన్నారు. నర్సింగ్ అన్నా... నర్సింగ్ అన్నా అని మాట్లాడేవాడని తెలిపారు.
ఈ మధ్య కాలంలో దేవుడు....సినిమా వాళ్ల మీద పడ్డాడని, మంచివాళ్లనే తీసుకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొద్ది రోజుల క్రితం శ్రీహరి, ఆతర్వాత ధర్మవరపు సుబ్రహ్మణం, ఇప్పుడు ఉదయ్ కిరణ్ మృతి కలిచి వేస్తుందన్నారు.