‘నిర్భయ’ మెక్కడ!? | nirbhaya law | Sakshi
Sakshi News home page

‘నిర్భయ’ మెక్కడ!?

Published Thu, Dec 19 2013 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

‘నిర్భయ’ మెక్కడ!?

‘నిర్భయ’ మెక్కడ!?

ఢిల్లీ రేప్ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. నిర్భయకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు జరిగాయి. మహిళలపై దాడులను అరికట్టేందుకు నిర్భయ చట్టాన్నీ తీసుకువచ్చింది. కానీ... మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పెళ్లి చేసుకోమన్నందుకు నల్లగొండలో మంగళవారం ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమికుడు కిరోసిన్ పోసి నిప్పంటిస్తే.. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నాలుగు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై అదేవిధంగా దాడి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరేళ్లు, ‘ప్రకాశం’లో ఎనిమిదేళ్లు, హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్న బాలికలపై లైంగికదాడులు జరిగాయి.
 
కిరోసిన్ పోసి.. నిప్పంటించి..

పిఠాపురం, న్యూస్‌లైన్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కీర్తి రేవతి (17)పై  ఎం. నవీన్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు 75 శాతం కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పిఠాపురం వేణుగోపాలస్వామి గుడి వీధిలో నివసిస్తున్న కీర్తి శంకర్‌బాబు కుమార్తె రేవతి పదో తరగతి చదువుతోంది. కత్తులగూడెంనకు చెందిన నవీన్ ఆరు నెలలుగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.

కుమార్తె నుంచి విషయం తెలుసుకున్న శంకర్‌బాబు అతడ్ని మందలించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేస్తానని బెదిరించాడు. దీనికి నవీన్ భయపడకపోగా మరింత రెచ్చిపోయాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పరువు పోతుందని భావించిన శంకర్‌బాబు నెల రోజులుగా కూతురును బడి మాన్పించి అనపర్తికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించాడు.

ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉంది. వివాహ సమయం దగ్గరపడడంతో రేవతి తల్లి నాగరత్నం బుధవారం ఉదయం పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు రాజమండ్రి వెళ్లగా, తండ్రి పత్రికలు పంచేందుకు కాకినాడ వెళ్లాడు. రేవతి ఒంటరిగా ఉండడం గమనించిన నవీన్ ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన శంకర్‌బాబు నిందితుడ్ని పట్టుకునేందుకు యత్నించాడు. పెనుగులాటలో నవీన్ ఫోన్ కిందపడిపోగా, అతడు పరారయ్యాడు. 75 శాతం గాయాలైన రేవతి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
 డ్రెస్ కొనిస్తానని ఆశచూపి...

 హైదరాబాద్, న్యూస్‌లైన్: డ్రెస్ కొనిస్తానని ఆశ చూపించి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిపిన సంఘటన  కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం... బోరబండకు చెందిన వాసుదేవరాజు (34) అదే కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు కొత్త దుస్తులు కొనిస్తానని కేపీహెచ్‌బీ కాలనీ నాల్గవ ఫేజ్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చిన్నారిని చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు.
 
 హోంగార్డుపై ‘నిర్భయ’ కేసు

అదృశ్యమైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డుపై వనస్థలిపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం... హయత్‌నగర్ మండలం రాగన్నగూడ గ్రామ పంచాయితీ టీచర్స్‌కాలనీకి చెందిన మహ్మద్ మౌలానా కూతురు (17) స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో మంగళవారం మౌలానా వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం ఇంటికి చేరుకున్న బాలిక మంగళవారం రాత్రి తనపై రాహుల్ అనే హోంగార్డు అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. మధు అనే స్నేహితుడు తనను బైక్‌పై తుర్కయంజాల్ వద్ద వదిలిపెట్టాలని రాహుల్ బైక్‌పై పంపించాడని, అతడు రాత్రి 11.30 గంటల సమయంలో నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్లాడని తెలిపింది. హోంగార్డుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు
 చేసినట్లు సీఐ చెప్పారు.
 
 ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానని...


 మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం మహ బూబ్‌నగర్ పట్టణానికి వలసవచ్చింది. పదేళ్లుగా గప్‌చుప్‌ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తోంది. వారి ఆరేళ్ల కూతురు ఇంటిముందు ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన మోహిద్(20) ఐస్‌క్రీం ఇప్పిస్తానని ఎర్రగుంట్ల ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై ఆత్యాచారం చేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలిక తీవ్రంగా గాయపడిందని, భయంతో తీవ్రజ్వరం వచ్చిందని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 

జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి...


 హనుమంతునిపాడు: ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో మంగళవారం ఓ యువకుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మండల పరిధిలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన మహిళ తన కూతురు(8)ను తీసుకుని మంగళవారం వేములపాడు గ్రామానికి వెళ్లింది. సాయంత్రం పొద్దుపోయాక ఇంటికి తిరిగివస్తూ కూతుర్ని అదే గ్రామానికి చెందిన బ్రహ్మయ్య అలియాస్ బ్రహ్మనాయుడు(18)తో పంపించింది. అతడు బాలికకు మాయమాటలు చెప్పి దారిలో ఉన్న జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నొప్పితో బాధపడుతుండగా బుధవారం ఉదయం తల్లి విచారించడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement