ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగాలి | Prakasam Collector Pola Bhaskar Has Directed District Officials To Address The Public Issues In A Timely Manner | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగాలి

Published Tue, Jul 30 2019 9:58 AM | Last Updated on Tue, Jul 30 2019 9:59 AM

Prakasam Collector Pola Bhaskar Has Directed District Officials To Address The Public Issues In A Timely Manner - Sakshi

వృద్ధులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణి చేస్తున్న కలెక్టర్‌  

సాక్షి, ఒంగోలు అర్బన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందజేసి అర్జీల తాలూకు సమస్యలను ప్రాముఖ్యతగా పరిగణించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం, భరోసా పెరగాలన్నారు. ప్రతివారం స్పందన అర్జీల పరిష్కారంపై సమీక్షిస్తానని ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు మండల అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సోమవారం జరిగిన స్పందనలో జిల్లా వ్యాప్తంగా 499 అర్జీలు జిల్లా కలెక్టర్‌కు అందాయి.

కార్యక్రమంలో వృద్ధులకు మూడు చక్రాల సైకిళ్లను కలెక్టర్‌ పంపిణి చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ షాన్‌మోహన్, ట్రైనీ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్, డీఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, ప్రత్యేక కలెక్టర్‌ గంగాధర్‌ గౌడ్, డీఆర్‌డీఏ పీడీ నరసింహులు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, పశుసంవర్థక శాఖ జేడీ రవీంద్రనాథ్‌ ఠాగూర్, డీఈఓ సుబ్బారావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డయ్య, ఐసీడీఎస్‌ పీడీ విశాలక్ష్మి, ఒంగోలు ఆర్‌డీఓ పెంచల కిషోర్, ఎస్‌ఎస్‌ఏ పీఓ ఎం వెంకటేశ్వరరావు, ఓఎంసీ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, హెచ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బోనస్‌ వచ్చే వరకు శనగల వేలం నిలుపుదల చేయాలి
రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాథ్‌ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు, మద్దిపాడు శనగరైతులు స్పందనలో జిల్లా కలెక్టర్‌ను కలిసి శనగ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ వచ్చే వరకు కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న శనగల వేలంను నిలుపుదల చేయాలని కోరారు. నాగులుప్పలపాడు, మద్దిపాడు మండలాలకు సంబంధించిన ఈదుమూడి, చీర్వానుప్పలపాడు, వెంకట్రాజుపాలెం, మల్లవరం, బొద్దులూరివారిపాలెం గ్రామాలకు చెందిన శనగ రైతులు 2018లో సాగు చేయగా వచ్చిన శనగలకు గిట్టుబాటు ధర లేక ఏడుగుండ్లపాడులోని నీలి, శ్రావణి కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వ చేశారని తెలిపారు. అయితే మద్దిపాడు, ఇంకొల్లు ఎస్‌బీఐ బ్యాంకు వారు శనలగలను వేలం వేసేందుకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం క్వింటాకు రూ.1500 బోనస్‌ ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు వేలం వేయడం వలన రైతులు నష్టపోతారని బోనస్‌ వచ్చేవరకు వేలం నిలుపుదల చేయాలని కోరారు.

జీఓ నంబర్‌ 25 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలి
►జీఓ నంబర్‌ 25 ప్రకారం మాల మాదిగలకు సమానంగా ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి విజయ్‌కుమార్‌ స్పందనలో కలెక్టర్‌ను కలిసి అర్జీ అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన 1,36,000 ఉద్యోగాల్లో జీఓ ప్రకారం మాదిగలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
► అద్దంకి పట్టణం నంబూరివారిపాలేనికి సంబంధించిన పలు కుంటుంబాలు స్పందనలో కలెక్టర్‌ను కలిసి తమభూమిన కాపాడాలని కోరారు. సర్వే నంబర్‌ 955లో 20.25 ఎకరాల భూమిఉందని దానిలో 14.35 ఎకరాల భూమిని 1950 నుంచి నంబూరివారిపాలేనికి చెందిన 54 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆ భూమలకు సంబంధించి 1993లో సబ్‌ డివిజన్‌ చేసి అందరికీ సమానంగా ఒక్కొరికి 25 సెంట్ల చొప్పున తాత్కలిక పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే 2015లో కొంతమంది రాజకీయ బలంతో తమ భూమల్లో ఎలాంటి అనుమతి లేకుండా నీరు చెట్టు పేరుతో దౌర్జన్యంగా మట్టిని తవ్వుకున్నారని తెలిపారు. దీంతో సాగు చేయలేక 54 కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎం నాగమణి, కమలమ్మ, కోటమ్మ తదితరులు ఉన్నారు.
►శింగరాయకొండ మండలం బింగినపల్లి  పరిసర గ్రామ ప్రజలు స్పందనలో కలెక్టర్‌ను కలిసి ఫ్యాక్టరీ వ్యర్థాలతో తాగునీరు కలుషితమవుతుందని అంతేకాకుండా అక్కడ పరిసరాలు కలుషితమవుతూ ప్రజలకు తీవ్ర అనారోగ్యాలు వస్తున్నాయని అర్జీ అందజేశారు. పరిశీలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు.
►సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన రావూరి నాగిరెడ్డి స్పందనలో కలెక్టర్‌ను కలిసి తనకు ఫించన్‌ ఇప్పించాలని విన్నవించుకున్నాడు. పుట్టుక నుంచి కళ్లు కనపడకుండా ఉండటంతో పాటు నరాల వ్యాధితో బాధపడుతున్నాని గత మూడేళ్ల కిందట సదరం ద్వారా వైద్య పరీక్షలు చేయించుకున్నా ఇంతవరకు సర్టిఫికెట్‌ ఇవ్వలేదని వాపోయాడు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న తనకు సదరం సర్టిఫికెట్‌ ఇప్పించి ఫించన్‌ మంజూరు చేయాలని కోరాడు.
►చిన్నగంజాం మండలం కడవకుదురుకు చెందిన పులగం కోటేశ్వరరావు తనకు 65 సంవత్సరాల వయస్సు ఉందని అయితే పింఛన్‌కు దరఖాస్తు చేసకుని ఎన్నిసార్లు తిరిగిన పింఛన్‌ మంజూరు చేయాలేదని తనకు పింఛన్‌ మంజూరు చేయాలని కోరాడు.
►వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానిక చెందిన పలువురు ప్రకాశంభవనం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం స్పందనలో అర్జీ అందజేశారు. రామచంద్రాపురంలో అనాధిగా పుల్లరిపాలెం సర్వే నంబర్‌ 248–5, 248–6లో సుమారు 5ఎకరాల భూమిని గ్రామస్తులు అందరూ ఉమ్మడిగా అనుభవిస్తున్నారని తెలిపారు. అయితే ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేసిన కోడూరు వెంకటేశ్వర్లు అధికార దుర్వినియోగంతో సదరు భూమిని కటుంబ సబ్యుల పేరుపై చూపి ఆన్‌లైన్‌ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. పరిశీలించి గ్రామంలో గొడవలు, ఘర్షణలు లేకుండా చూడాలని కోరారు.

వ్యక్తి ఆత్మహత్యా యత్నం
ఒంగోలు అర్బన్‌:  సింగరాయకొండ మండలం బైరాగిమన్యంలో నివసం ఉంటున్న తాడికొండ వెంకటరమణయ్య సోమవారం ప్రకాశం భవనంలోని కంట్రోల్‌ రూం వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్పందన కార్యక్రమంలో తన సమస్యను తెలుపుకునేందుకు భార్య, కూతురు నాగలక్ష్మి, మాధవిలతో వచ్చాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు ఆనంద్‌ గమనించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. గట్టిగా కేకలు వేయడంతో పోలీసులు, ప్రజలు అక్కడకు చేరుకుని ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించారు. అనంతరం పోలీసులు వెంకటరమణయ్యతో పాటు కుటుంబసభ్యులను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం బైరాగిమాన్యం తన ఇంట్లో తాము ఉండటానికి వీలు లేదంటూ కావలికి చెందిన భగవాన్‌దాస్‌ అనే వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపాడు. 20 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన స్థలంపై కందుకూరు కోర్టులో కేసు వేసి ఇబ్బందులు పెడుతున్నాడని వయస్సు మీద పడటంతో పనికూడా చేయలేని పరిస్థితులో ఉన్నాని ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో ఇళ్లు కోల్పేతే ఎక్కడ ఉండాలో అర్ధకాని పరిస్థితిలో తనకు ఆత్మహత్య శరణ్యమని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement