రబీ సాగు భళా! | Rabi cultivation Bravo! | Sakshi
Sakshi News home page

రబీ సాగు భళా!

Published Mon, Feb 3 2014 3:59 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Rabi cultivation Bravo!

  •   సాధారణ విస్తీర్ణంలో 93 శాతం పంటలు సాగు
  •      వారం రోజుల్లో విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం
  •      జొన్నసాగుపై రైతుల మక్కువ
  •  సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఈ రబీ సీజన్ రైతన్నల్లో ఉత్సాహం నింపింది. గతేడాది కురిసిన వర్షాలు ప్రస్తుత రబీ సాగుకు ఊతమిచ్చాయి. భూగర్భజలాలు సంతృప్తికరంగా ఉండడంతో ఈ సీజన్‌లో వరితో పాటు ఇతర మెట్ట పంటలు కూడా భారీగా సాగయ్యాయి. ప్రస్తుత రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 42వేల 287 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసి ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు 39 వేల 322 హెక్టార్లలో వివిధ పంటలు సాగైనట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం విస్తీర్ణంలో 93 శాతం సాగు పూర్తయినట్లు స్పష్టమవుతోంది.
     
    జొన్న పంట జోరుగా..
     
    తాజాగా జొన్న పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో 5,238 హెక్టార్లలో జొన్న పంట సాధారణ విస్తీర్ణం కాగా.. ఇప్పటివరకు 11,575 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగైంది. సాధారణ విస్తీర్ణం కంటే రెట్టింపు స్థాయిలో సాగవ్వడంపై రైతు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అదేవిధంగా శనగ, వేరుశనగ పంటలు కూడా ఆశించిన స్థాయిలో సాగయ్యాయి. మార్చి నెలాఖరు నాటికి రబీ సీజన్ ముగియనుంది. అయితే వరి మినహా మిగిలిన పంటలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

    జిల్లాలోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వరి పంట కాస్త నెమ్మదిగా మొదలవుతుంది. వరి సాగుకు సంబంధించి సాధారణ విస్తీర్ణం 15,255 కాగా.. ఇప్పటివరకు 8808 హెక్టార్లలో సాగైంది. మెజారిటీ రైతులు మరో వారం రోజుల్లో నాట్లు పూర్తి చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరి సాగు కూడా సాధారణ విస్తీర్ణాన్ని చేరుకోనున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
     

Advertisement
Advertisement