నామినేషన్ల ఘట్టం దగ్గర పడటంతో రాజ్య(పెద్దల)సభకు పార్టీల అభ్యర్థులెవరన్న దానిపై సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :నామినేషన్ల ఘట్టం దగ్గర పడటంతో రాజ్య(పెద్దల)సభకు పార్టీల అభ్యర్థులెవరన్న దానిపై సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి చైతన్యరాజుతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జె.సి.దివాకరరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ల పేర్లు నాలుగైదు రోజులుగా నలుగుతున్నాయి. నామినేషన్ల అనంతరం బరిలో మిగిలే వారెవరనే విషయం ప్రస్తుతానికి పక్కనబెడితే సీమాంధ్ర జిల్లాల్లో ఎవరు బరిలో నిలిస్తే ఎంతమంది మద్దతు లభిస్తుందని నేతలు లెక్కలు తీస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జిల్లాల్లో మద్దతు సాధించే దిశగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బరిలో నిలుస్తానంటున్న ఎమ్మెల్సీ చైతన్యరాజు ఆదివారం హైదరాబాద్‌లో రెండు విడతలుగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేసీ, గంటా, ఉండవల్లి, చైతన్యరాజుల్లో చివరకు బరిలో ఒకరే నిలుస్తారా లేక ఒకరికి మించే పోటీ పడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. చైతన్యరాజు అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. ఆ ముగ్గురితో కూడా ఆయన మాట్లాడుతున్నారని సమాచారం.
విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు తొలుత చైతన్యరాజుకు మద్దతు ఇవ్వడం, అనంతరం బరిలోకి వచ్చిన గంటా వైపు మొగ్గు చూపడం, విభజన పరిణామాల్లో జేసీ, గంటా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగితే చైతన్యరాజు పేరు పరిశీలించాలనే ప్రతిపాదన కాంగ్రెస్ వర్గాల్లో వచ్చిందని సమాచారం. ఉండవల్లి పేరును ఎంపీ హర్షకుమార్ శనివారమే తెరపైకి తీసుకురాగా మిగిలిన నాయకులెవరూ సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్ వేయనున్నట్టు చైతన్యరాజు హైదరాబాద్ నుంచి ‘సాక్షి ప్రతినిధి’కి
ధ్రువీకరించారు.
ధనబలమే ‘దేశాని’కి గీటురాయి..!
తెలుగుదేశం విషయానికి వస్తే సమర్థత కంటే ఆర్థిక అంశాలే ప్రామాణికమవుతున్నాయి. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా రికార్డు స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నా వారిని పక్కనబెట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లా ల పార్టీ అధ్యక్షులు చినరాజప్ప, సీతామహాలక్ష్మి అవకాశం కోసం పోటీపడుతుం డగా మహిళా కోటాలో సీతామహలక్ష్మికే అవకాశం ఉండవచ్చన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరందరినీ కాదని ఆర్థిక దన్ను కలిగిన నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.నారాయణ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అంతకంటే అన్యాయం మరొకటి ఉండబోదని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.