ప్రత్యేక హోదా సాధించేవరకు విశ్రమించం
పీసీసీ అధ్యక్షుడు రాఘువీరారెడ్డి
ఆనందపేట (గుంటూరు) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించేది లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి రూ.25వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌ను మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడలోని హెల్ప్ హాస్పటల్‌కు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
పసికందు మృతి దారుణం..
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందడం దారుణమైన విషయమన్నారు. దానికి వైద్యులు, సిబ్బందిని బాధ్యులుగా చేసి సస్పెన్షన్ చేయడం సరికాదన్నారు. పసికందును కాటేసింది ఎలుకలు కాదని, విషకోరలు ఉన్న టీడీపీ నాయకులని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, కూచిపూడి సాంబశివరావు, జంగా గౌతమ్, ఈరి రాజశేఖర్, సవరం రోహిత్, యర్రబాబు, బిట్రగుంట మల్లిక, జిలాని, పవన్‌తేజ, మొగిలి శివకుమార్, దొంత సురేష్, యర్రం శెట్టి పూర్ణ, మౌలాలి, ముత్యాలు, ఉస్మాన్, చిన మస్తాన్‌వలి ఉన్నారు.