అమలులో నిర్లక్ష్యం
=స.హ.చట్టం పరిధిలోనే దేవాదాయశాఖ
=తప్పుడు సమాచారమిస్తే జరిమానా
=కమిషనర్ పీ విజయబాబు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఉద్యోగులూ ప్రజలేనన్న నిజాన్ని గ్రహిస్తే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించగలుగుతారని స.హ. చట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. స్థానిక హిందూ కళాశాలలో స.హ. చట్టంపై జిల్లా అధికారులు, అప్పిలేట్ అధికారులు, పౌరసమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులకు గురువారం అవగాహన సదస్సు జరిగింది.
ఆయన మాట్లాడుతూ స.హ. చట్టాన్ని అమలు చేయడం ఉద్యోగుల విధుల్లో భాగమేనన్నారు. 2005 అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన స.హ. చట్టం సత్ఫలితాలిస్తుందని చెప్పారు. ఈ చట్టం అమలులో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ్ణజిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం వివిధ అభివృద్ధి పథకాల్లో ప్రజల భాగస్వామ్యం లేకపోవటమేనని చెప్పారు. స.హ. చట్టం ప్రకారం సమాచారమివ్వని కార్యాలయ అధికారులపై 41-బీ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉందన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులకు రూ. 25 వేలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం ఆదర్శంగానే ఉందన్నారు. పారదర్శకమైన పాలన అందించడానికి స.హ. చట్టం అమలు చేయడం మంచి పరిణామమని చెప్పారు. జేసీ పీ ఉషాకుమారి మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు. వివిధ శాఖల అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు స.హ. చట్టం కమిషనర్ విజయబాబు సమాధానమిచ్చారు.
జిల్లా ఖజానాశాఖ డీడీ నాగేశ్వరరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ , విజయవాడ, నూజివీడు సబ్‌కలెక్టర్లు డీ హరిచందన, చక్రధరరావు, బందరు ఆర్డీవో పీసాయిబాబు, డీఆర్డీఏ పీడీ శివశంకరరావు, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ సీహెచ్ బాలునాయక్, గుడివాడ ఏఎన్‌ఆర్ కళాశాల ఉద్యోగి పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అమలులో ఇంత నిర్లక్ష్యమా....
సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా వెనుకబడి ఉందని విజయబాబు అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమలులోకి వచ్చిన 120 రోజుల్లో చట్టాన్ని అమలు చేసే అప్పిలేట్ అధికారుల వివరాలను ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాల్సి ఉండగా.... 8సంవత్సరాలైనా ఈ ప్రక్రియ జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స.హ. చట్టం అమలులో జిల్లాలో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదని చెప్పారు.
దేవాదాయశాఖ అధికారులు తాము ఈ చట్టం పరిధిలో లేమని చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. స.హ. చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలో ఒక దేవస్థానం ట్రస్టీ పరిధిలో ఉన్నందున సమాచారం ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విధంగా స.హ. చట్టంపై పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఢిల్లీలో అమ్‌ఆద్మీ పార్టీని స్థాపించి ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన క్రేజీవాల్ స.హ. చట్టం కార్యకర్తగానే తన జీవితాన్ని ప్రారంభించారన్నారు. మచిలీపట్నం విలేకరుల ఆధ్వర్యంలో విజయబాబును ఘనంగా సత్కరించారు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో...
మోపిదేవి : మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ ఎస్‌ఐ శ్రీనివాస్, వీఆర్వో శేషగిరిరావు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
సమాచారమివ్వకపోతే చర్యలే
Published Fri, Dec 13 2013 1:37 AM | Last Updated on Sat, Apr 6 2019 9:37 PM
Advertisement