5 వరకూ ఉద్యమ కార్యాచరణ: అశోక్‌బాబు | Samaikya andhra Movement Activity to be continued by november 5: Ashok babu | Sakshi
Sakshi News home page

5 వరకూ ఉద్యమ కార్యాచరణ: అశోక్‌బాబు

Published Wed, Oct 23 2013 4:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

5 వరకూ ఉద్యమ కార్యాచరణ: అశోక్‌బాబు - Sakshi

5 వరకూ ఉద్యమ కార్యాచరణ: అశోక్‌బాబు

సాక్షి, కాకినాడ: రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈనెల 23 నుంచి నవంబర్ 5 వరకూ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో కార్యాచరణ ప్రణాళికను నేతలు వివరించారు. ఈనెల 23న అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, 24న లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్లు, 25న రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై సమైక్య నినాదాలతో కూడిన పోస్టర్లు, స్టిక్కర్లు అతికించడం, 26న ప్రజలతో కలిసి ప్రదర్శనలు, 27ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ జాతీయ రహదారుల దిగ్బంధం, 28న రిలే దీక్షలు, 29న సైకిల్, మోటార్ సైకిల్ ర్యాలీలు, 30న మానవహారాలు, 31న లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్లు నిర్వహించనున్నామన్నారు. నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని, 2,3,4 తేదీల్లో రైతు సదస్సులు, 5న మళ్లీ లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
 
  అంతకుముందు జరిగిన సభలో సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక రాష్ర్ట అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు మాట్లాడుతూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణం మళ్లీ నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో 10లక్షల మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఒకపక్క కుండపోతగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన సమైక్యవాదులను ఉద్దేశించి ఆయన సుమారు అరగంటకు పైగా ప్రసంగించారు. ‘ఈ రాష్ర్టం విడిపోదు. విడదీసే శక్తి ఏ పార్టీకీ లేదు. 2014 వరకూ ఎన్ని ఉద్యమాలైనా.. త్యాగాలైనా చేస్తాం. విభజనను అడ్డుకుని తీరుతాం. ఆ తర్వాత విభజన ప్రక్రియను ఆపే శక్తి మీ చేతుల్లో ఉన్న ఓటు హక్కుకే ఉంది. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఓటు వేయాలో కూడా చెబుతాం. విభజన ద్రోహుల స్థానాలను ఎవరితో భర్తీ చేయాలో కూడా మా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది. మీ ప్రాంతంలో సమైక్యవాదానికి కట్టుబడిన నాయకుడు ఉంటే పార్టీలకతీతంగాపట్టంగట్టాలి’ ఆయన పిలుపునిచ్చారు.  
 
 ఎంపీలు రాజీనామా చేయనందునే కేంద్రం దూకుడు
 ఎంపీలు రాజీనామాలు చేయకపోవడం వల్లనే కేంద్రం రాష్ట్ర విభజనపై దూకుడుగా వెళుతోందని అశోక్‌బాబు పేర్కొన్నారు. కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమిస్తున్న పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుందని అన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో ఖాళీలు పోగా నూట అరవై మంది ఉన్నారని, వారి అభిప్రాయాలు అడగడానికి వెళితే యాభై మందే దొరికారన్నారు. దొరకని వారిలో చంద్రబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు ఉన్నారన్నారు. సమైక్యాంధ్రపై ఎవరివద్ద నుంచీ లిఖిత పూర్వకంగా లేఖలు తీసుకోలేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునేవారు తెలంగాణ  ప్రాంతంలో 65 నుంచి 75 శాతం వరకూ ఉన్నారని చెప్పారు. జీఓఎంను కలిసి ఉద్యోగ సంఘాల తరఫున ఆర్టికల్ 371(డి)ఉన్నది కనుక విభజన ఆపాలని కోరతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement