ఇల్లెందుఅర్బన్,న్యూస్‌లైన్: మహిళాలోకం కదం తొక్కింది.... ఐకేపీ మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్టూ, ఐకెపీ మెంబర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో ఇల్లెందులో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్‌డివిజన్ పరిధిలోని మహిళలు వేలాదిగా పాల్గొన్న ఈ ప్రదర్శన మార్కెట్‌యార్డు నుంచి బయలుదేరి జగదాంబసెంటర్, పాతబస్టాండ్ ఏరియా, బుగ్గవాగుబ్రిడ్జి, కొత్తబస్టాండ్ ఏరియాల మీదుగా వెలుగు కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం వెలుగు కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ చంద్రకళకు అందజేశారు.
మహిళలను ఆదుకోవడంలో విఫలం: పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ ప్రదర్శనకు ముందు కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ మాట్లాడుతూ....నిరుపేద మహిళలకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మహిళల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఐకేపీ గ్రూపులోని ప్రతి సభ్యురాలికి వడ్డీలేని రుణం లక్షరూపాయలు మంజూరు చేయాలని, బకాయి పడ్డ రుణాలను వడ్డీలు లేకుండా కట్టించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో సమావేశ సౌకర్యార్థం కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయాలన్నారు. మండల సమాఖ్య ఆఫీసు బేరర్స్‌కు 5 వేలరూపాయల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బిల్డింగ్, కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వాలని కోరారు. గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్‌ఆర్‌సీ పాలసీ చేయాలన్నారు.
నిధులు మంజూరు చేయాలి: ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు
స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం ఇతర పనులకు వినియోగిస్తు దుర్వినియోగం చేస్తోందని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ఐకేపీ మహిళల అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడినర్సయ్య, ఎన్డీ రాష్ట్ర నేత రాయలచంద్రశేఖర్, పీఓడబ్ల్యు జిల్లా నాయకురాలు చండ్ర అరుణ,నాయకులు ప్రసాద్, అయిలయ్య, కిన్నెరనర్సయ్య, రమణ, పూనెం కమల, ఉపేంద్ర, మాచర్ల సత్యం, సుభద్ర,సక్రు తదితరులు పాల్గొన్నారు.
'ఐకేపీ మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
Published Thu, Sep 26 2013 4:39 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement