హైదరాబాద్ : సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఇది మరింత కుంగదీస్తోంది. కోస్తా, రాయలసీమకు వెళ్లాల్సిన బస్సులను ఉద్యమం కారణంగా నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి రాయలసీమ జిల్లాలకు రోజూ 710 బస్సులు నడస్తుండగా గత అయిదు రోజులుగా సర్వీసులన్నీ రద్దయ్యాయి.
కాగా శనివారం నుంచి ఒంగోలు, నెల్లూరు, వైపు 90 శాతం, విజయవాడ, గుంటూరు వైపు 75 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల వైపు 50 శాతం, విశాఖపట్నం వైపు 25 శాతం బస్సులను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు గత్యంతరం లేక రైలు, విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి కర్నూలు జిల్లాకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించారు.
కాగా సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు సోమవారం కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. విజయనగరం, పార్వతీపురం డిపోల్లోని బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. రాయగడ, కోరాపుట్, జైపూర్ సహా ఒడిశాకు సర్వీసులు నడవటం లేదు.
మరోవైపు పార్వతిపురం రైల్వేస్టేషన్లో ఈరోజు ఉదయం సమైక్యవాదులు రైల్రోకో చేపట్టారు. దుర్గ్-విశాఖ ప్యాసింజర్ రైలును ఆందోళనకారులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మద్దిలపాలెం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలకు దిగారు. బంద్ కారణంగా నేడు ఏయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.