ఏటా కొండలను గుల్లచేస్తూ సాగించే రంగురాళ్ల తవ్వకాలు సాలూరు ఏజెన్సీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా పట్టించుకోకుండా ఎప్పటిలాగే పలుగుపార పట్టుకుని కొండలను తొలిచేస్తున్నారు. రూ.కోట్లలో వ్యాపారం సాగుతుండడంతో వ్యాపారులే కూలీలను నియమించి తవ్వకాలు సాగిస్తున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నా కూలీలు, వ్యాపారులు వెరవడంలేదు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన వర్తకులు వెనక ఉండి చక్రం తిప్పుతున్నారు.
సాలూరు/సాలూరు రూరల్: చినుకుపడితే చాలు ఏజెన్సీలో రంగురాళ్ల జాతర ప్రారంభమవుతుం ది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండప్రాం తంలో మట్టి వదులుగా మారడంతో రంగరాళ్ల కోసం తవ్వకాలు ప్రారంభించారు. సాలూరు ఏజెన్సీతో పాటు ఒడిశా రాష్ట్రంలోని సుంకి వద్ద ఈ తవ్వకాలు జోరుగా సాగుతు న్నాయి. మట్టిపెళ్లలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నా కూలీలు భయపడడం లేదు.
మండలంలోని సారిక పంచాయతీలోని సొంపిగాం స మీపంలోనున్న బంగారుగుడ్డి, సంపంగిపాడు పంచాయతీలోని పుల్లమామిడి సమీపంలోనున్న తండికొండ, రూడి గ్రామం సమీపంలోని హనుమాన్‌కొండ, దండిగాం కొత్తూరు సమీపంలోని సూరన్నకొండలతోపాటు బట్టివలస సమీపంలోని ఎత్తై కొండలతోపాటు దొరలతాడివలస సమీపంలోని గుట్టల్లోనూ, దుగ్దసాగరం డిపట్టా భూముల్లో కూడా విలువైన రంగురాళ్లున్నాయి. ప్రస్తు తం తండికొండ, హనుమాన్‌కొండ, దొరలతాడివలస, బట్టివలస ప్రాంతాలలో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ రాకను గమనించిన తవ్వకందారులు పరుగందుకుని కొండలెక్కారు.
రూ కోట్లలో వ్యాపారం
రంగురాళ్ల తవ్వకాలపై నిషేధం ఉన్నా బేఖాతరుచేస్తున్నారు. కేట్ ఐ, మూన్ స్టోన్ తదితర రకాల రంగురాళ్లు ఎక్కువగా లభ్యమవుతుండడంతో ఈ ప్రాంతంపై వ్యాపారులు దృష్టి పెట్టారు. వీటి పరిమాణం, నాణ్యతనుబట్టి వేల రూపాయల నుంచి రూ. లక్షల్లో ధర పలుకుతున్నాయి. స్థానిక వ్యాపారులు తవ్వకందారుల నుంచి రంగురాళ్లను కొనుగోలుచేసి బడావ్యాపారులకు చేరవేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కోటి రూపాయలకు పైనే వ్యాపారం జరిగినట్టు తెలిసింది. బయటకుమాత్రం ఇదో కక్కుర్తి వ్యాపారంలా, గిరిజనులకు ఉపాధి మార్గంలా కనిపిస్తున్నా, అక్రమ వ్యాపారుల పాలిట కామథేనువుగా మారింది.
నర్సీపట్నం వ్యాపారులే కీలకం
స్థానికంగా లభ్యమవుతున్న రంగురాళ్ల కొనుగోలులో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ఇద్దరు వ్యాపారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకవ్యాపారి గతంలో లాడ్జిలో మకాంవేసి లావాదేవీలు నిర్వహించేవాడు. కానీ గత రెండేళ్లగా పోలీసులు నిఘా అధికమవడంతో తన సమీప బందువు ఇంట్లో తిష్టవేసి చక్రం తిప్పుతున్నాడు. అలాగే మరోవ్యాపారి సాలూరు, రామభద్రపురం తదితర ప్రాంతాల లాడ్జీలలో ఉంటూ స్థానిక వ్యాపారుల నుంచి రంగురాళ్లను కొనుగోళు చేస్తున్నాడు.
విఫలమవుతున్న పోలీసు
రంగురాళ్ల తవ్వకాలను నిలువరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమతున్నారు. ఏజెన్సీప్రాంతంలోని ఎత్తై కొండలపై తవ్వకాలు జరగుతుండడంతో అక్కడకు వెళ్లలేకపోతున్నారు. ప్రయాసపడి వెళ్లినా వీరి రాకను పై నుంచి గమనించి, కూలీలు పారిపోతుండడం పరిపాటైంది. ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు.
గుట్టల్లో... గుట్టుగా
Published Sun, Jun 14 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement