పర్యాటకం వెలవెల
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలను రాశులుగా పోసి అమ్మిన నేల ఇది. ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చేతిలో కాలజ్ఞానం పురుడు పోసుకుంది. తాళ్లపాక అన్నమాచార్యుల నోటి వెంట పదకవితలు జాలువారాయి. బ్రిటీష్ దురహంకారానికి వ్యతిరేకంగా గర్జించిన రేనాటి సింహం ఇక్కడి వాడే.. ఇలా చెప్పుకుంటూ పోతే కర్నూలు జిల్లాకు చెందిన విశేషాలు ఎన్నో ఉన్నాయి.
అయితే వాటిని భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి కలిగించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ప్రసిద్ధ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ. 100 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఏమూలకు సరిపోవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పర్యాటక అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది.
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఇవే..
* జిల్లాలో శ్రీశైలం దేవాలయం, మహానంది, ఆహోబిలం, కొండారెడ్డి బురుజు.. తదితర కట్టడాలు చాలా పురాతనమైనవి. వీటి సందర్శనకు ప్రతి రోజు వందల మంది వస్తుంటారు.
* డోన్ మండలం ఎస్.గుండాల చెన్నకేశవ స్వామి ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. అక్కడ ‘లేపాక్షి’ తరహా కట్టడాలు ఉన్నాయి.
* జిల్లాలో మూడు ప్రాచీన సూర్య దేవాలయాలు ఉన్నాయి. నందికొట్కూరులోని రాజావీధి, అవుకు మండలంలోని శివవరం, గడివేముల మండలంలోని గని గ్రామంలో ఉన్నాయి. వీటి అభివృద్ధి నామమాత్రంగానే ఉంది.
* కొలనుభారతిలో సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్ర అభివృద్ధికి అధికారులు ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
* ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లిలో బెలుం గుహలకు మించిన వాల్మీకి గుహలు ఉన్నాయి. అద్భుతమైన జలపాతాలతోపాటు ఎన్నో ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి. దీన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.
* మద్దిలేటి స్వామి దేవస్థానం, మహనంది క్షేత్రం, పెద్దతుంబలం రామాలయం, కొలను భారతి అభివృద్ధికి 13వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా అవి మరుగున పడిపోయాయి.
* జిల్లాను ఏకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు నల్లమల, సుద్దమల అడవులు విస్తారంగా ఉన్నాయి.
విజయవాడకు వెళ్లిన శిల్పారామం...
జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 2009 నుంచి 2014 వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పర్యాటక శాఖ అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా.. అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో 40 ఎకరాల్లో మినీ శిల్పారామం నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఉన్నా మరుగున పడిపోయాయి. అయితే కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో విజయవాడలో శిల్పారామం ఏర్పాటవుతోంది.
కొండారెడ్డి బురుజుపై ఎగరని జాతీయ పతాకం..!
కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజుకు విద్యుత్ అలంకరణ చేయడానికి, శాశ్వత జాతీయ పతాకం ఏర్పాటుకు సంబంధించి కొన్నేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి. 168 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఏర్పాటు అయితే శాశ్వత జాతీయ పతాకాల్లో ఐదోది అవుతుంది. అయితే ఇందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా.. ఫలితం లేకుం డా పోయింది. కొండారెడ్డి బురుజును విజయనగరం రాజులు నిర్మించారు. ఇది అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ప్రగతి ప్రతిపాదనలకే పరిమితం..
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ప్రకటించారు. జిల్లా అధికారులు రూ.35.72 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అలాగే సాధారణ ఎన్నికలకు ముందు కర్నూలు శివారులోని విజయవనం, కొండారెడ్డి బురుజు, గోల్‌గుంబజ్, జగన్నాథ గట్టు అభివృద్ధికి రూ.4.17 కోట్లు మంజూరయినట్లు ప్రకటించారు. ఆలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నిధుల విడుదల ఆగిపోయింది. రాష్ర్టంలో పర్యాటక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ దగ్గరే ఉంచుకున్నారు. సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఆయన కృషి చేయాల్సి ఉంది.
ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి 2008లో రూ.70 లక్షలు విడుదల అయ్యాయి. ఆ తరువాత ఇప్పటి వరకు నిధులు రాలేదు. 2009 నుంచి 2012 వరకు పలుసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. పర్యాటక రంగం అభివృద్ధి కోసం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇటీవల ప్రతిపాదనలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతవరకు ప్రతిపాదనలు పంపాలని ఎవరూ కోరలేదు.
- వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక శాఖ అధికారి