సోదరులకు భోజనం వడ్డిస్తున్న సోదరి
ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా భగినీ హస్తభోజనాలు చేసేందుకు మహిళలంతా సిద్ధమయ్యారు. భగినీ అంటే తోబుట్టువు అయిన సోదరి. ఆమె చేతివంట తినడం భగినీ హస్తభోజనం. ఇది దీపావళి వెళ్లిన రెండో రోజు వస్తుంది. దీనినే యమ ద్వితీయ అంటారు. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్ఠత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె తన అన్న దగ్గరకు ప్రతినిత్యం వెళ్లి తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి తీరిక దొరకలేదు. దీంతో ఎలాగైనా ఒక రోజు చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి ఆయనకు కార్తీకమాసం, శుక్లపక్షం ద్వితీయ తిథి నాడు విరామం దొరికింది. ఆరోజున సోదరైన యమున ఇంటికి వెళ్లాడు. చాలాకాలం తర్వాత తన ప్రార్థన మన్నించి వచ్చిన అన్నకు యమున షడ్రషోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం యమధర్మరాజుకు కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమన్నాడు.
ప్రతి ఏడాది రావాలని..
అప్పుడామె ‘అగ్రజా నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినాలి. అంతేకాక ప్రతి సంవత్సరం కార్తీక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో అలాంటి వాళ్లకు నరకబాధ ఉండకూడదు’ అని వరం కోరింది. యముడు తథాస్తు అని వరమిచ్చాడు. నాటి నుంచి ఈ వేడుకను యమ ద్వితీయ, భాతృద్వితీయ, అన్నదమ్మల భోజనాలు ప్రసిద్ధికెక్కాయి. భగినీ హస్తభోజనం అనాదిగా వస్తున్న సంప్రదాయ ఆచారం. ఇందులో మానవ జీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి జీవించలేడు. కుటుంబంలో తల్లిదండ్రులు ముఖ్యులు. వారు సంతానాన్ని కని, పెంచి, పోషించి విద్యాబుద్ధులను ప్రసాదించి తమ సంతానానికి కుటుంబాలను ఏర్పాటు చేస్తారు.
మనిషికి తల్లిదండ్రుల తర్వాత ఆత్మీయులైనవారు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే. తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక తమ సంతానం జీవించినంతకాలం వారు జీవించి ఉండలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం జీవించే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి అంతేకాక ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? కనుక ఈ అన్నదమ్ముల భోజన సంప్రదాయం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య జీవితాంతం ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకుదెరువుకోసం దూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది.
ఇక ఈ ఆధునిక కాలంలో ఉపాధి కోసం రాష్ట్రాల సరిహద్దులేకాదు దేశాలు, ఖండాలూ దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికోసారే కాదుగదా రెండు, మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్మలు, అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతివంటను భుజించి తమకున్నదాంట్లో ప్రేమగా కానుకలు ఇస్తే ఆత్మీయబంధాలు వర్థిల్లుతాయి. ఒకరికొకరు అండగా ఉన్నామనే భావన కలుగుతుంది. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమంకోసం ఏర్పాటు చేసినవే ఆచారాలనీ, వాటిని వంశపారంపర్యక్రమంలో పాటించినప్పుడే సంప్రదాయాలవుతాయనీ పెద్దలమాట.
ఆచారం ఎప్పుడూ దోషభూయిష్టమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకుని వాటిని సవరించుకొని చక్కగా ఆచరించడమే ఉత్తమం. ఆత్మావై పుత్రనామాసి అన్నది వేదం. అంటే తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతిరూపాలే. అమ్మ చేతివంట అమృతంకు సమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంటకూడా సుధామయమే. కనుక భగినీ హస్తభోజనం అన్నివిధాలా అమృతభక్షణంతో సమానం. ఏ ఆచారమైనా మానవాళి మధ్య సద్భావలను పెంపొందింపజేసి స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగానిలపడంకోసమే.
Comments
Please login to add a commentAdd a comment