చార్జ్
- ప్రజలకు బీజేపీ ప్రభుత్వ కానుక
- రైలు చార్జీలు పెంచుతూ నిర్ణయం
- సరకు చార్జీలనూ వదల్లేదు
- ప్రయూణికులపై అదనపు భారమే..
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కార్ ప్రజలపై భారాల బండ వేయడం మొదలుపెట్టింది.మొదటి మెట్టుగా రైల్వే చార్జీలను అమాంతం పెంచేసి ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. సరకు రవాణా చార్జీలతో పాటు స్లీపర్ క్లాస్, ఏసీ టికెట్ రేట్లను పెంచడంతో రైల్వే ప్రయూణికులు ఆందోళనలో మునిగిపోయూరు.
సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా గడవకముందే ఎన్‌డీఏ సర్కార్ ప్రజలపై పన్నుల దాడి చేస్తోంది. తాజాగా రైలు ప్రయాణికులపై పన్నుల భారం మోపింది. ధరలను, చార్జీలను నియంత్రిస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన బీజేపీ ఇప్పుడు చార్జీల మోత మోగించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనతోనే అతలాకుతలం అవుతున్న సీమాంధ్ర ప్రాంత సగటు ప్రయాణికుడు పెరిగిన చార్జీలను చూసి కంగుతింటున్నారు.
కొత్త రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉండవని, పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు పోదామని భావిస్తున్న ఈ ప్రాంతవాసులకు పెరిగిన రైల్వే చార్జీలు భారమే అవుతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. బస్సు చార్జీలతో పోల్చితే రైలు చార్జీలు తక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతి వర్గాలతో పాటు ఉన్నత వర్గాలు రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు వీటి రేటు పెంచడంతో వారి గుండెలో రాయి పడినట్టయియంది.
25 నుంచి అమల్లోకి..
పెరిగిన రైలు చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీలపై 14.2 శాతం చార్జీల మోతమోగే అవకాశం ఉంది. సరకు రవాణా చార్జీలు 6.5 శాతం పెంచారు. ఈ భారం ప్రజలపై పరోక్షంగా పడనుంది. చార్జీల పెరుగుదల విషయానికి వస్తే.. స్లీపర్ క్లాస్ అయితే 300 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు రూ.30 నుంచి రూ.50 మేర చార్జీ పెంచారు. ఏసీ త్రీటైర్, టు టైర్ రూ.50 నుంచి రూ.100 మధ్య పెరిగింది. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్‌పై పెరిగిన చార్జీల రేట్లను రైళ్లలో టీటీఈలు వసూలుచేస్తారని రైల్వే అధికారులు చెప్పారు.
చార్జీల పెంపు ఇలా..
సరకు రవాణా చార్జీలు : 6.5 శాతం
స్లీపర్ క్లాస్ (300-500 కిలోమీటర్ల మధ్య) : రూ.30-రూ.50
ఏసీ త్రీటైర్, టు టైర్ : రూ.50- రూ.100 మధ్య