ఇద్దరు మత్స్యకారుల గల్లంతు
అచ్యుతాపురం : నాలుగు చేపలు ఎక్కువ పడతాయని ఆశతో పొట్ట చేతపట్టుకొని కాకినాడ తీరానికి వెళ్లారు. వేటలో జరిగిన అపశ్రుతి కారణంగా ఇద్దరు మత్స్యకారులు మంగళవారం గల్లంతయ్యారు. వారిపై ఆధారపడిన రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. దీంతో పూడిమడకలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. పూడిమడకకి చెందిన చోడిపల్లి దేముడు (40), గనగళ్ల తాతయ్య (45) రెండు వారాల కిత్రం వేటకు కాకినాడ తీరానికి వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే వేట సాగిస్తున్నారు.
రెండు రోజుల క్రితం షిప్ వద్ద రెండు బోటులు వేట సాగిస్తూ ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటనలో మత్స్యకారులిద్దరూ గల్లంతయ్యారు. గురువారం సమాచారం తెలియడంతో పూడిమడకలో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. క డసారి చూపునకు కూడా నోచుకోలేదని గ్రామస్తులు దుఃఖించారు. దేముడికి భార్య రమణ, ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాతయ్యకి భార్య చెట్టెమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మత్స్య సంపద కోసం వలసబాట
పూడిమడక తీరం నుంచి వేటాడే పడవల సంఖ్య పెరగడంతో చేపలు లభించడం లేదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మత్స్యసంపద తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆయిల్ ధర గిట్టుబాటు లేని పరిస్థితి ఉంది. కాకినాడ రేవుకి సమీపంలో లంగరువేసిన ఓడల సమీపంలో చేపలు చేరుతాయి. ఎక్కువ మొత్తంలో చేపలు పడతాయని ఆశతో ఇక్కడి నుంచి మత్స్యకారులు వలస వెళ్తున్నారు. ప్రస్తుతం 30 తెప్పలతో 200 మంది పూడిమడక జాలర్లు అక్కడే వేట సాగిస్తున్నారు. ఓడల చుట్టూ తిరుగుతూ వేటాడే క్రమంలో పడవలు ఢీకొని ప్రమాదం జరిగిందని మత్స్యకారులు తెలిపారు.