ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదు!: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమం ఎగసి పడుతుంటే ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదని.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారైనా, ఉద్యమంలో ఎక్కడ కనిపించకపోవడం శోచనీయమన్నారు.
ప్రజలకు ధైర్యం చెప్పి నమ్మకాన్ని కల్పించాల్సిన వారిద్దరూ అండర్ గ్రౌండ్‌లో దాకున్నారన్నారు. తన వాదననను గట్టిగా వినిపిస్తే సీఎం పదవికి ఎసరు వస్తుందనే భయంతో కిరణ్ దూరంగా ఉండగా, చంద్రబాబు తన ఆస్తులను కాపాడు కోవడానికి మౌనంగా ఉన్నారని శోభా తెలిపారు. దీంతో సీమాంధ్ర ఉద్యమానికి తీరని ద్రోహం జరుగుతుందన్నారు. ప్రతీ చిన్నవిషయానికి హడావిడి చేసే చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో బొమ్మల్లాగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి పార్లమెంట్‌లో రాజకీయ డ్రామా చేస్తున్నారన్నారు.రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది వారే.. ఉద్యమాల్లో పాల్గొంటున్నది వారేనని ఎద్దేవా చేశారు. ఆరు నెలల పదవి కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టారన్నారు.
కోట్ల మంది తెలుగు ప్రజల సమస్యను ఆంటోని, దిగ్విజయ్ సింగ్‌లు ఎలా పరిష్కరిస్తారిని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పదిహేను ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేత షర్మిలను విమర్శించే హక్కు టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావుకు లేదని, కేసీఆర్ ఏ రకంగా మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకోవాలని శోభా నాగిరెడ్డి సూచించారు.