‘పార్టీని వదులుకున్నాక బాధ కలిగింది’
►పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు
►2020లో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం
హైదరాబాద్: క్రియాశీల రాజకీయల నుంచి తప్పుకొని ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న వెంకయ్యనాయుడుకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పార్టీని తల్లిలా భావిస్తానని, పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని, అవే వచ్చాయన్నారు.
కేంద్రమంత్రిగా పనిచేస్తున్నప్పుడే పార్టీ తనను జాతీయ ఉపాధ్యక్షుడిని చేసిందని, అలాగే చిన్నతనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని అన్నారు. అమ్మలాంటి పార్టీని వదిలిపెట్టడం బాధగా అనిపించిందన్నారు. ప్రధాని మోదీ నన్ను కన్నీటితో ఓదార్చారన్నారు.
2020లో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, పదవిలో ఉండగానే రాజకీయాలు వదిలి సామాజిక సేవలో పాల్గొంటానని వెంకయ్య తెలిపారు. ఇక రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తన పిల్లలకు ముందే చెప్పానని వెంకయ్య నాయుడు అన్నారు. తన కుమారుడు చేసే వ్యాపారాలు ఏంటో తనకు తెలియదన్నారు. కొంతమంది స్వర్ణభారతి ట్రస్ట్ చేస్తున్న ఆరోపణలు బాధ కలిగించాయని వెంకయ్య పేర్కొన్నారు.
Very happy in sharing my thoughts, important events in my life & journey to this position with my friends, well wishers at a meet & greet. pic.twitter.com/qwtct5weCy
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 July 2017
కాగా నగరంలో ఏర్పాటు చేసిన వెంకయ్యనాయుడు ఆత్మీయ అభినందన సభకు ఐటీ మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల, మాజీ డీజీపీలు రాముడు, దినేష్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్, నాగార్జున. అల్లు అరవింద్, సుద్దాల అశోక్‌తేజ, మురళిమోహన్, సుజనాచౌదరి, జేపీ తదితరలు పాల్గొన్నారు.