రాజాగారి కోట చుట్టూ రాజకీయం | Venkatagiri Politics Around King | Sakshi
Sakshi News home page

రాజాగారి కోట చుట్టూ రాజకీయం

Published Wed, Mar 6 2019 1:08 PM | Last Updated on Wed, Mar 6 2019 1:09 PM

Venkatagiri Politics  Around King - Sakshi

 వెంకటగిరి రాజాప్యాలెస్‌ , సాయికృష్ణ యాచేంద్రతో చర్చిస్తున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు 

వెంకటగిరి: ‘35 ఏళ్ల నుంచి టీడీపీకి సేవ చేశాం. మాకేం గుర్తింపు ఉంది. మాకు పెద్ద పదవులు ఇవ్వమనలేదు. కిరీటాలు పెట్టమనలేదు. కనీస గౌరవం కోరుకోవడం తప్పా.. ఎందుకు మా గురించి మీర అడగలేదు. ఎమ్మెల్యే కోసం పరుగెత్తుకుని వచ్చారే.. మా కోసం అడిగిన వారెవరైనా ఉన్నారా? మా దగ్గర వర్క్‌లు లేవు. కాంట్రాక్ట్‌లు లేవు. డబ్బులు లేవు అందుకేనా .. మేము నగరిలో ఉన్నాం. మాకేమీ తెలియదు అనుకోవద్దు. అజ్ఞానులం, అసమర్థులం కాదు. ఎక్కడా క్రమశిక్షణ తప్పలేదు. ఎమ్మెల్యే రామకృష్ణ స్వగ్రామంలో నాకు సన్నిహితుడు అయిన రామచంద్రయ్యను చూసేందుకు ఎమ్మెల్యే  అనుమతి తీసుకుని పోయానే. నాకు అవసరమా !   అయినా మాకేం ఓట్లు లేవు కదా.’ అని  సాయికృష్ణ యాచేంద్ర ప్రశ్నించారు.

సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఖరారు అవుతుండడంతో వెంకటగిరి రాజకీయం వేడెక్కుతోంది. నియోజకవర్గం అధికారపార్టీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే కె.రామకష్ణ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినప్పటికీ పార్టీ విజయానికి రాజా కుటుంబం అండదండలు ఉంటేనే సాధ్యమని, ఈ క్రమంలో రాజా కుటుంబీకులను ప్రసన్నం చేసుకునే షరతును అధిష్టానం ఎమ్మెల్యేకు పెట్టినట్లు సమాచారం. రాజాలు సహకరించకుంటే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేరును పరిశీలించే అవకాశం ఉందని అమరావతి వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే వెంకటగిరి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎస్సీవీ నాయుడుకు సూచాయగా సూచించినట్లు తెలిసింది.

వెంకటగిరి టీడీపీ రాజకీయం రాజాల చుట్టూ తిరుగుతోంది. రాజా కుటుంబీకులు డాక్టర్‌ సాయికష్ణ యాచేంద్ర, సర్వజ్ఞ కుమార యాచేంద్ర టీడీపీని వీడనున్నారనే ప్రచారం పట్టణంలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సిటింగ్‌ ఎమ్మెల్యే కె రామకృష్ణ రెండు రోజుల క్రితం సాయికష్ణ యాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్రను కలిసి తనకు సహకరించాలని కోరడంతో వారి నుంచి సానుకూల స్పందన లభించలేదు. ఆఖరి ప్రయత్నంగా మంగళవారం నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల్లోని టీడీపీ అవిర్భావం నుంచి పనిచేసిన ద్వితీయశ్రేణి నాయకులను రంగంలోకి దింపి రాజా ప్యాలెస్‌కు పంపి సాయికృష్ణ యాచేంద్రను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

రగిలిపోయిన రాజా సాయికృష్ణ యాచేంద్ర

మంగళవారం రాజా కుటుంబీకుడు సాయికృష్ణ యాచేంద్రను కలిసేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి సుమారు 60 మందికి పైగా మండల స్థాయి కీలకనేతలు రాజాప్యాలెస్‌కు తరలివచ్చారు. డక్కిలి ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి, డక్కిలి జెడ్పీటీసీ రామచంద్రనాయుడు, వెంకటగిరి ఏఎంసీ చైర్మన్‌ పి.రాజేశ్వరరావు తదితరులు సాయికృష్ణ యాచేంద్రను కలిసి పార్టీకి సహకరించాలని కోరారు. దీంతో ఆయన సహజ శైలికి భిన్నంగా గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.  ఆయన స్పందించిన తీరు ఆయన మాటల్లోనే..  ‘మాకూ ఓర్పు.. సహనం.. కనీస మర్యాద ఉంటాయి. పార్టీ నుంచి అదే కోరుకున్నాం...  డబ్బు కోసమే రాజకీయం అంటే ఏలా.. రాజకీయం ఏమన్నా వ్యాపారమా ? రాజకీయానికి డబ్బు అవసరం కావచ్చుకానీ, రాజకీయాన్నే వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు వచ్చిన వారంతా ఈ ఐదేళ్లు ఏమయ్యారు? ఇష్టం వచ్చినపుడు మోహం చూపించేది. ఇష్టం లేనప్పుడు మానుకునేదీ. ఎమయ్యా. అంత పనికిమాలిన వాళ్లంగా ఉన్నామా ? అవసరం వస్తే వస్తారు. లేక పోతే రారా ?. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటామంటారా? చచ్చిపోయేముందు తీర్థం పోస్తే ఏమిటీ? విషం పోస్తే ఏమిటి. 30 ఏళ్ల నుంచి కలిసి ఉన్నాం. అయితే ఏమి చేయగలం. ప్రస్తుత పరిస్థితి వేరు.  నన్ను  ఏ విషయంలో అయినా సంప్రదించారా? ఓ సందర్భంలో చంద్రబాబునాయుడు నన్ను అడిగారు మీరెన్ని కోట్లు చూశారు అని, కోట్లు పోయాయి. అన్నీ పోయాయి అని నిట్టూర్చారు.

2004లో టీడీపీ ఓడిపోయే పరిస్థితి. ఎన్నికలకు మేము సిద్ధంగా లేకపోయినా బాబు గారు ఫోన్‌ చేస్తే పోటీ చేశాం. అప్పట్లో ఎంత మంది వెన్నుపోట్లు పొడిచారో గుర్తుంది. ఆ గాయాలు ఇప్పటికీ మానలేదు. అవన్నీ  కూడా నేను మరిచిపోయాను. మా కుటుంబంలో ఒక్కరిది ఒక్కో దారిగా ఉండబోం. అందరిదీ ఒకే మాట. ఒకే బాటగా సాగుతాం. అన్న ఒక పార్టీ. తమ్ముడు ఒక పార్టీగా ఉండబోం. ఇన్ని సంవత్సరాలు విలువలతో ఉన్నాం. వందల సంవత్సరాల చరిత్రని ఈ రోజు బుగ్గిపాలు చేయలేం. అందరం ఒకే మాటమీద నడవాల్సిందే. తండ్రి ఓ పార్టీ. కొడుకు ఓ పార్టీగా రాజకీయాలు చేసేందుకు మా మనసు ఒప్పుకోదు. ఇన్ని రోజులు టీడీపీ కోసం శ్రమించాం. ఇప్పుడు వాళ్లు మమ్మల్ని వద్దనుకున్నారు. కావాలనుకుని ఉంటే ప్రత్యేకంగా ఉండేది. మా సుదీర్ఘ రాజకీయ పయనంలో మేమేం కాంట్రాక్ట్‌ పనులు అడగలేదు. అటువంటప్పుడు పార్టీ విషయాలు కలిసి ఎందుకు మాట్లాడలేకపోయారు. కనీసం ఫోన్‌లో సమాచారం ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయా’ అని ప్రశ్నించారు.  ‘ఇప్పటి దాకా విస్మరించిన వాళ్లు మళ్లీ అదే చేయబోరని నమ్మకం ఏమిటి? మేం నిర్ణయం తీసుకున్న తరువాత తెలియజేస్తాం. ఇష్టం ఉన్న వాళ్లు మాతో కలిసి రండి’ అంటూ ముక్తాయింపు ఇచ్చారు.

 ఎమ్మెల్యే రామకృష్ణ వద్ద వక్రీకరణ

సాయికృష్ణ యాచేంద్రతో చేసిన సంప్రదింపులు సారాంశాన్ని ద్వితీయశ్రేణి నాయకులు స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణకు వక్రీకరించి చెప్పినట్లు సమాచారం. సాయికృష్ణ యాచేంద్రకు పార్టీ పదవి కావాలని ఉందని , ఆ విషయమే మా వద్ద ప్రస్తావించారని చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణ ఆ విషయం తనకు నేరుగా చెప్పి ఉండవచ్చు కదా. ఇంత రాద్ధాంతం ఏమటని ఆయన అన్నట్లు సమాచారం. అయితే సాయికృష్ణ యాచేంద్ర చేసిన వ్యాఖ్యలు మంగళవారం సాయంత్రానికి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement