వీఆర్వో ‘యోగానందరెడ్డి ’ | VRO topper yuganaddha reddy | Sakshi
Sakshi News home page

వీఆర్వో ‘యోగానందరెడ్డి ’

Published Sun, Feb 23 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

VRO topper yuganaddha reddy

పుట్లూరు, న్యూస్‌లైన్ :  ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో పుట్టి.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన యోగానందరెడ్డి (హాల్‌టికెట్ నంబర్ 112103198) గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పరీక్ష ఫలితాల్లో 99 మార్కులతో రాష్ర్టస్థాయి మూడో ర్యాంకును సాధించాడు. పుట్లూరు మండలం మడుగుపల్లికి చెందిన యోగానందరెడ్డి ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. అనంతరం తన తల్లి స్వస్థలం పుట్లూరు మండలం కడవకల్లు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు చదివాడు. నార్పల ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి పూర్తి చేశాడు. అక్కడే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అనంతపురం ఆర్‌‌ట్స కళాశాలలో డిగ్రీ, ఎస్కేయూనివర్సిటీలో పీజీ (ఎమ్మెస్సీ-మ్యాథ్‌‌స) చేశాడు. హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్-1కు ప్రిపేరవుతున్నాడు. ఈలోపే వీఆర్వో పరీక్షలో రాణించాడు.
 
 కుటుంబ నేపథ్యం
 మడుగుపల్లికి చెందిన యోగానందరెడ్డిది ఉమ్మడి కుటుంబం. అతడి తండ్రి ఓబుళరెడ్డికి ముగ్గురు సోదరులున్నారు. మొత్తం 16 మంది కుంటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. యోగానందరెడ్డి ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడే తల్లి నాగలక్ష్మమ్మ అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి యోగానందరెడ్డిని, అతడు సోదరుడు రాజేంద్రప్రసాద్‌ను కుటుంబ సభ్యులు ఎంతో అపురూపంగా చూసుకున్నారు. చిన్నతనం నుంచి చదువులో, ఆటపాటల్లో చురుగ్గా ఉండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 
 గ్రూప్-1 ర్యాంక్‌పైనే దృష్టంతా...
 వీఆర్వో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రోజూ 8 గంటలు చదివా. గతంలో గ్రూప్-2కు కష్టపడటం వల్ల వీఆర్వో పరీక్ష రాయడం సులభంగా మారింది. జాబ్ గ్యారెంటీ అనుకున్నాను. కానీ ర్యాంకుపై ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబ సభ్యుల ప్రోత్సహంతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం వీఆర్వో పరీక్షల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరింత కష్టపడి చదివి గ్రూప్-1లో మెరుగైన ర్యాంకు సాధించాలని నా ఆశయం.
 - యోగనాందరెడ్డి వీఆర్వో పరిక్షల్లో స్టేట్ మూడో ర్యాంకర్
 

 గర్వంగా ఉంది
 నా కొడుకు రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. వారి చిన్నతనంలోనే నా భార్య మరణించింది. అప్పటి నుంచి చిన్నాన్నలు, చిన్నమ్మలు వారిని ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించా. యోగానందరెడ్డి ఒక వైపు చదువుతూనే ఇంటి వద్ద ఉన్న సమయంలో పొలం పనులు చేసేవాడు. కష్టపడే తత్వం అతడిలో ఉందని నాకు ముందే తెలుసు. అయితే నాకు ఇంత మంచి పేరు తెచ్చినందుకు గర్వంగా ఉంది.                           
 - ఓబుళరెడ్డి, యోగానందరెడ్డి తండ్రి
 

 మడుగుపల్లికి మంచిపేరు తెచ్చాడు
 యోగానందరెడ్డి వీఆర్వో పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి మా గ్రామానికి మంచిపేరు తెచ్చాడు. చిన్నతనం నుంచే అన్ని విషయాల్లో చురుగ్గా ఉండేవాడు. భవిష్యత్‌లో ఇతర పోటీ పరీక్షల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించి మా గ్రామానికి, అతడి కుటుంబసభ్యులకు మరింత పేరును తీసుకురావాలి. ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నా.                
 - నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ మడుగుపల్లి
 

Advertisement
Advertisement