'కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం'
-
పార్టీలో కొనసాగడంపై మంత్రులు టీజీ, ఏరాసు, గంటా
-
బిల్లు పెట్టినట్లు తేలిన మరుక్షణమే రాజీనామా
-
కిరణ్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? లేదా సీఎం పెట్టే కొత్త పార్టీలో చేరాలా? టీడీపీలోకి వెళ్లాలా?.. అనే అంశాలను తమ అనుచరులు, కార్యకర్తలతో చర్చించాకనే నిర్ణయిస్తామని మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షకట్టి మరీ తెలుగు ప్రజల గొంతు కోస్తోందని, ఆ పార్టీలో కొనసాగడం ఎవరికీ ఇష్టం లేదని వారు వ్యాఖ్యానించారు. ఆదివారం సీఎం కిరణ్‌తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేస్తానని కొన్ని నెలలుగా సీఎం అంటున్నా తామే వారించామని.. సీఎం ఇప్పుడు కూడా అందుకు సిద్ధమయ్యారని మంత్రులు చెప్పారు. బిల్లు పెట్టలేదని బీజేపీ అంటున్నందున.. రాజీనామా చేస్తే బిల్లు ప్రవేశపెట్టినట్లు సంకేతాలు పోతాయని, రాజీనామా చేయకుండా ఉంటే బీజేపీ వాదనకు బలం చేకూరుతుందని తాము వివరించినట్లు పేర్కొన్నారు. బిల్లుపై అధికారికంగా ప్రకటన వచ్చాక సీఎం రాజీనామా చేస్తారని వెల్లడించారు. కొత్త పార్టీ అవసరం ఎంతో ఉందని... సీఎం కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చెప్పారు. అయితే, కొత్త పార్టీ సంగతి తమతో సీఎం ప్రస్తావించలేదని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మీడియాకు తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై ఏం జరుగుతుందో వేచి చూడాలని తాను సీఎంకు తెలిపానని ఎమ్మెల్యే మస్తాన్‌వలీ చెప్పారు. సీఎం రాజీనామాతో పాటు అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన కూడా వచ్చే అవకాశముందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెప్పారు. ఈ నెల 18 లేదా 19న సీఎం రాజీనామా చేయవచ్చని వారు పేర్కొన్నారు.
బిల్లు పెట్టినట్లు తేలిన మరుక్షణమే రాజీనామా: పితాని
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారా? లేదా? అన్న సందిగ్ధం ఉన్నందున... దానిపై అధికారిక ప్రకటన వచ్చిన తక్షణమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. రాజీనామాపై కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో సీఎం చర్చించారని... బిల్లు పెట్టలేదని ప్రతిపక్షాలు చెబుతున్నందున రాజీనామా చేయవద్దని తామంతా సీఎంకు చెప్పామని వివరించారు. సీఎం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదని... కేంద్ర మంత్రుల సూచనలు, ఢిల్లీలో ఏపీఎన్జీవోల దీక్షల నేపథ్యంలో సోమవారం సాయంత్రం నిర్ణయించే అవకాశముందని తెలిపారు.