ఈడు దాటినా కుదరని జోడీ | Weddings are being too late and after no kids to some people in the both telugu states | Sakshi
Sakshi News home page

ఈడు దాటినా కుదరని జోడీ

Published Thu, Sep 14 2017 4:05 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

ఈడు దాటినా కుదరని జోడీ

ఈడు దాటినా కుదరని జోడీ

- ఉద్యోగాల వేటలో ముగుస్తున్న పుణ్యకాలం 
లేటు వయసులో పెళ్లిళ్లు 
సంతానోత్పత్తిపై దుష్ప్రభావం 
మంచిదికాదంటున్న వైద్య నిపుణులు  
స్త్రీ, పురుష నిష్పత్తి మధ్య అధికమవుతున్న అంతరం 
అమ్మాయిల కొరతతో పెరుగుతున్న బ్రహ్మచారులు  
 
ఈడు దాటుతున్నా పెళ్లి బాజా మోగడం లేదు. వివిధ కారణాలతో తగిన జోడీ కుదరక లక్షలాది మంది బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారు. మరికొంతమంది వివాహ వయసు దాటాక పెళ్లి చేసుకొని సంతాన ప్రాప్తికి దూరమవుతున్నారు. పిల్లలు పుట్టడం లేదంటూ వైద్య నిపుణులు, సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. వయసు ముదురుతున్నా పెళ్లి కావడం లేదనే బాధతో మానసిక వైద్య నిపుణుల దగ్గరకు వెళ్లేవారు ఎక్కువ అవుతున్నారు. కారణాలేమైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.  
 
సాక్షి, అమరావతి: దేశంలో మూడు పదుల వయసు దాటినా పెళ్లి బాజా మోగని వారి సంఖ్య 2.40 కోట్ల పైమాటే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 15 లక్షలు దాటింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో 9.90 లక్షలు, తెలంగాణలో 5.20 లక్షల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత రిజిస్ట్రార్‌ జనరల్, జనాభా లెక్కల కమిషనరేట్‌ ప్రకటించిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌)– 2015 వివరాలివి. ఉద్యోగ వేటలో భాగంగా కోచింగ్‌లు, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సి రావడంతో చాలామంది పెళ్లీడు దాటిపోతోంది. మరికొందరికి సరైన జోడీ కోసం వెతుకులాటలోనే కాలం గడిచిపోతోంది. కుటుంబ బాధ్యతలు పూర్తి చేసే సరికే కొందరి వయసు మీరిపోతోంది. కారణాలేమైనప్పటికీ ఆలస్య వివాహాల వల్ల దుష్పరిణామాలుంటాయని, సరైన వయసులో పెళ్లి చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. 
 
మూడు పదులు దాటితే కష్టమే.. 
మూడు పదులు దాటిన తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారిలో చాలామందికి ఆశించిన లక్షణాలున్న అమ్మాయిలు దొరకడం లేదు. కొందరు అమ్మాయిలదీ ఇదే పరిస్థితి. ఇలా వివాహ వయసు దాటుతున్న యువతీయువకులు చాలా అంశాల్లో రాజీపడితే తప్ప పెళ్లిళ్లు కావడం లేదు. గతంలో అమ్మాయిలకు పెళ్లి సంబంధాల కోసం వచ్చిన తల్లిదండ్రులు మాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్లేనని చెప్పేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అబ్బాయి ఫొటో ఇస్తే అమ్మాయికి నచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పేస్తున్నారు. వయసు ఎక్కువ ఉందని తెలిస్తే వద్దని చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లు కాని వారి సంఖ్య పెరుగుతోందని మ్యారేజీ బ్యూరోల నిర్వాహకులు చెబుతున్నారు.

అల్లుడి కోసం అమ్మాయి తల్లిదండ్రులు చెప్పులరిగేలా తిరిగే రోజులు పోయి అనుకూలవతి అయిన కోడలి కోసం అబ్బాయి తల్లిదండ్రులు.. ప్రదిక్షణలు చేస్తున్న రోజులు వచ్చాయి.. అమ్మాయిల కొరతే ఇందుకు కారణం అని పెళ్లిళ్ల పేరయ్యలు కుండబద్దలు కొడుతున్నారు. ఆలస్య వివాహాలు చేసుకుంటున్న, బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న అమ్మాయిలు కూడా ఉంటున్నారు. అయితే అబ్బాయిలతో పోల్చితే వీరి శాతం చాలా తక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే పెళ్లి కాని వారి సంఖ్య, ఆలస్య వివాహాలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశ జనాభాలో పెళ్లి బాజాకు నోచుకోని వారిలో 30 ఏళ్ల వయసు దాటిన వారు 1.8 శాతం, 35 ఏళ్లు దాటిపోయిన వారు 0.9 శాతం మంది ఉన్నారు. 
 
బలవన్మరణాలు.. 
పెళ్లి కాలేదనే మానసిక వ్యథతో ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తమ పిల్లలకు పెళ్లి కాలేదనే వేదనతో ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మ (పేరు మార్చాం) కొడుకుకు పెళ్లి కావడం లేదని ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగిన ఆమెను బంధువులు వెంటనే గమనించి ఆస్పత్రిలో చేర్పించడంతో బతికారు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. కొందరేమో డిప్రెషన్‌కు గురై ఆస్పత్రికి వస్తున్నారు.  
 
భవిష్యత్తులో తిప్పలు తప్పవు 
ఇప్పటికే పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు ఎక్కువగా, అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. అందువల్లే చాలామంది అబ్బాయిలకు అమ్మాయి దొరకని పరిస్థితి ఉంది. భవిష్యత్తులో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భ్రూణ హత్యలు పెరుగుతుండటమే దీనికి కారణం. రెండున్నర దశాబ్దాల క్రితం వరకూ పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం బాలురు కంటే బాలికల సంఖ్య బాగా తగ్గిపోయింది. వరకట్నాలు పెరిగిన నేపథ్యంలో పెళ్లి చేయడం కష్టమనే భావంతో చాలామంది గర్భిణిగా ఉన్నప్పుడే స్కానింగ్‌ తీయిస్తున్నారు. ఆడ శిశువు అని తెలిస్తే అబార్షన్‌ చేయిస్తున్నారు. దీంతో 14 ఏళ్ల లోపువారిలో బాలుర సంఖ్య భారీగా పెరగ్గా బాలికల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం 14– 15 ఏళ్ల వయసు ఉన్నవారు పెళ్లీడు కొచ్చేసరికి అమ్మాయిల కొరత మరీ ఎక్కువవుతుంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతంలో బాలికల శాతం మరీ తక్కువగా ఉండటం గమనార్హం.  
 
30 ఏళ్ల లోపు మంచిది 
ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నేటి యువతలో ఎక్కువగా ఉంటోంది. మంచి ఉద్యోగం సాధించి లేదా వ్యాపారం చేసి సొంత కాళ్లపై నిలదొక్కుకున్నాక వివాహం చేసుకుంటే ఆర్థిక చిక్కులు ఉండవనే ఉద్దేశం మంచిదే. అయితే ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి. మహిళకు 30 ఏళ్లు దాటే కొద్దీ గర్భాధారణ శాతం తగ్గుతుంది.. అబార్షన్‌ రేటు పెరుగుతుంది. ఒత్తిళ్ల వల్ల వయసు పెరిగే కొద్దీ పురుషుల్లోనూ వీర్య కణాల సంఖ్య తగ్గుతోంది. ఆలస్యంగా పిల్లలు పుడితే వారిని ఉన్నత చదువులు చదివించకముందే తల్లిదండ్రులు వృద్ధులు అవుతారు. 
– డా. అనగాని మంజుల, స్త్రీ వైద్య నిపుణులు, హైదరాబాద్‌ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement