‘పశ్చిమ’లో అసంతృప్త రాగం
* పదవుల్లో ప్రాధాన్యం లేదని టీడీపీ నేతల విమర్శ
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా ఈ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీతో కలిసి జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. టీడీపీ అధికారంలోకి రావడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు కీలకమయ్యాయనేది కాదనలేని వాస్తవం. దీంతో టీడీపీ శ్రేణులు తమ పంట పండినట్టేనని భావించారు. మంత్రి పదవుల్లోను, ప్రభుత్వ పోస్టుల్లోను తవుకు కీలకశాఖలు దక్కుతాయని ఆశపడ్డారు. కానీ ఆశించిన వారిని అందలమెక్కించని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహారశైలితో జిల్లా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడిప్పుడే అసంతృప్తి రాగం మొదలవుతోంది.
జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయించినా శాఖల కేటాయింపు పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. చింతలపూడి ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పీతల సుజాత మంత్రి పదవి ఇచ్చి గనులు, భూగర్భ, స్త్రీ శిశుసంక్షేమశాఖలు కట్టబెట్టినా మిత్రపక్ష బీజేపీ తరఫున తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావుకు ఎవరూ తీసుకోవడానికి ముందుకురాని దేవాదాయశాఖను అప్పగించారు. బీజేపీకి ఇచ్చిన పదవిని మినహాయిస్తే తమకు ఒకే మంత్రి పదవితో సరిపుచ్చడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీకి మొదటి నుంచి కొమ్ముకాస్తున్న సామాజికవర్గానికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తాజాగా ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టి సహాయమంత్రి హోదా ఇచ్చారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా కేవలం శాసనసభ వ్యవహారాలకే పరిమితమయ్యే విప్ పదవిని కట్టబెట్టడంపైన కూడా టీడీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. సామాజికవర్గాల సమతూకంలో మరో రెండు వర్గాలకు పదవులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. డెల్టా ప్రాంతంలో ఈసారి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బలమైన రెండు సామాజిక వర్గాలకు ఏం పదవులు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది.
సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఆచంట ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పోలవరం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎస్టీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు తొలివిడతలో అవకాశం రాకపోవడంతో ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు.
కీలక శాఖలన్నీ పొరుగు జిల్లాలకే
జిల్లా మొత్తం స్వీప్ చేసినా పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు పదవుల పంపకంలో సరైన ప్రాధాన్యత రాలేదన్న వాదనలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పొరుగు జిల్లా నేతలకు వచ్చిన పదవులతో పోల్చిచూస్తున్న రాజకీయ విశ్లేషకులు ఈ వాదనలను ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లకు గాను 14 సీట్లు గెలిచిన టీడీపీ నేతలకు పదవుల పంపకంలో అగ్రతాంబూలం లభించింది. ఆ జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవితో కీలకమైన హోంశాఖ, ఎమ్మెల్సీ కోటాలో యనమల రామకృష్ణుకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖ అప్పగించారు.
ఇటు కృష్ణాజిల్లా చూస్తే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలకమైన భారీ, మధ్యతరహా నీటిపారుదలశాఖ, కొల్లు రవీంద్రకు ఎక్సైజ్‌శాఖ కట్టబెట్టారు. అదే జిల్లా నుంచి బీజేపీ తరఫున గెలిచిన కామినేని శ్రీనివాస్‌ను వైద్య ఆరోగ్యశాఖ వరించింది. అంతెందుకు.. 17 నియోజకవర్గాల్లో 12 గెలిచిన గుంటూరు జిల్లానూ కీలక పదవులు వరించాయి.
ఆ జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యవసాయశాఖ, రావెల కిషోర్‌బాబుకు సాంఘికసంక్షేమ శాఖ ఇవ్వగా, ఏకంగా అత్యున్నతమైన స్పీకర్ పదవిని కూడా ఆ జిల్లాకే చెందిన కోడెల శివప్రసాదరావుకు అప్పగించారు. పొరుగు జిల్లాలకు వెల్లువలా పదవుల పంపకం చేస్తున్న టీడీపీ అధినాయకత్వం ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు ప్రాధ్యాన్యత ఇవ్వకపోవడంపై పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి.