
విభజనకు గంగిరెద్దులా తలూపిన సీఎం కిరణ్:భూమన
రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గంగిరెద్దులా తలూపి తలుపులు బార్లా తెరిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గంగిరెద్దులా తలూపి తలుపులు బార్లా తెరిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. విభజన నిర్ణయం వెలువెడిన వెంటనే సీఎం కిరణ్ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు వేయి తలల విషనాగులులా తలా ఓ మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
''సమైక్యవాదిలా ఫోజులు ఇవ్వడమే సిఎం కిరణ్కు తెలుసు. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. సమైక్య ముసుగు వేసుకున్న విభజన ద్రోహి కిరణ్. తన గురించి సొంత డబ్బా చెప్పుకోవడం తప్ప విభజనను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయడం లేదు. తనకు అనుకూలంగా పత్రికలు, చానెళ్లలో సమైక్యవాదినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపిఎన్జీఓల సమ్మెను ఎందుకు విరమింపచేశారు?'' అని భూమన ప్రశ్నించారు.