సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో తొమ్మిది రోజులపాటు జరిపిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. మునుపెన్నడూ లేని రీతిలో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాలో ఎన్నికలు జరుగుతోన్న రాజమండ్రి కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని వార్డు, వార్డును చుట్టి వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్ కం రైలువంతెన మీదుగా రాజమండ్రిలో అడుగుపెట్టారు.
అక్కడి క్వారీ మార్కెట్ ఏరియాలో ఈ నెల 17 రాత్రి మున్సిపల్ ఎన్నికల కోసం వైఎస్‌ఆర్ జనభేరికి శ్రీకారం చుట్టిన జగన్ మంగళవారం వరకు అవిశ్రాంతంగా ఎన్నికలు జరుగుతోన్న 11 ప్రాంతాల్లో ప్రజలను నేరుగా కలిశారు. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు, నాయకులకు, శ్రేణులకు తన పర్యటన ద్వారా గుండెల నిండా నైతిక స్థైర్యాన్ని నింపివెళ్లారు. జిల్లాలో జగన్ పర్యటన ప్రారంభమైన రాజమండ్రి మొదలుకుని తునిలో ముగిసే వరకు అడుగడుగునా ప్రజలు బారులు తీరి అక్కున చేర్చుకుని నీకు మద్దతుగా ఉంటామన్నా అంటూ ఆదరించారు.
రాజమండ్రి కార్పొరేషన్‌తోపాటు అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, ఏలేశ్వరం, తుని ప్రాంతాల్లో ప్రజలతో మమేకమయ్యారు. పింఛన్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నా ఇవ్వడం లేదని మహిళలు, వృద్ధులు, యువకులు, వికలాంగులు దారిపొడవునా జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో చలించిపోయిన జగన్ అమ్మఒడి పథకం ద్వారా బడికి పంపే పిల్లలకు ఒకరైతే రూ.500లు, ఇద్దరైతే రూ.1000లు వారి తల్లి ఖాతాలో వేస్తానని, రూ.200లున్న వృద్ధాప్య పింఛన్‌ను రూ.700లు, రూ.500లు ఉన్న వికలాంగుల పింఛన్ రూ.1000లు, డ్వాక్రా మహిళలకు 20వేల కోట్ల రుణాల మాఫీ, రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి హామీలతో వారి మనస్సు చూరగొన్నారు.
వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలకు స్పందించిన జగన్ జిల్లాలో మూడు కొత్త పథకాలను ప్రకటించారు. జిల్లా పర్యటనలో ప్రతి చోటా తమకు పింఛన్, రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతున్నా పనికావడం లేదని జనం మొరబెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జగన్ పంచాయతీలు, వార్డుల్లో ఒక ఆఫీసు తెరిచి అక్కడే ఒక రెటీనా మిషన్, స్కానర్ ఏర్పాటుచేసి ఎవరి గడపా ఎక్కకుండానే 24 గంటల్లోనే అడిగిన ఏ కార్డు అయినా చేతికందే ఏర్పాటు చేస్తానని, అదే ఆఫీస్ నుంచి అవ్వాతాతలకు పింఛన్‌లు కూడా అందిస్తానని వారిలో మనోధైర్యాన్ని నింపారు. అలాగే 2019 కల్లా విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూపిస్తానని, ప్రతి జిల్లాకు ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీలు ప్రజల్లో జగన్‌పై నమ్మకాన్ని పెంచాయి.
పర్యటనలో ఎంత జాప్యం జరుగుతున్నా లెక్కచేయకుండా తన కోసం గంటల తరబడి వేచిచూస్తున్న ప్రతి ఒక్కరినీ కలిసిన తరువాతే ముందుకు కదిలారు. ప్రతి ఒక్కరికీ కష్టసుఖాల్లో భాగస్వామినవుతానంటూ భరోసా నింపారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రతి రోజు ఉదయం 10 గంటలకు పర్యటన ప్రారంభించారు. రాత్రి 9 గంటల వరకు అలసట ఎరుగకుండా జనం సమస్యలు వింటూ వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. జగన్ సుమారు 375 కిలోమీటర్ల మేర పర్యటించారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రజల సమక్షంలోనే ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. జిల్లా పర్యటనలో ఆయన ముమ్మిడివరం, రామచంద్రాపురం, పెద్దాపురం, పిఠాపురం, తుని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులు, కాకినాడ, అమలాపురం పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నిలకు ముందు తొమ్మిది రోజుల జిల్లా పర్యటనలో దాదాపు అన్ని పట్టణ ప్రాంతాలలో వార్డుల్లోను, వీధులన్నింటినీ చుట్టి వెళ్లడం పార్టీ అభ్యర్థులలో ఉత్సాహాన్ని నింపింది. ఒక మున్సిపాలిటీలో రోజంతా సాగిన పర్యటన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్లో దడ పుట్టించింది. అందరి కంటే అభ్యర్థులను ముందు ప్రకటించడంతో పాటు ప్రచారంలో కూడా ప్రత్యర్థి పార్టీల కంటే ముందున్న వైఎస్‌ఆర్‌సీపీలో జగన్ పర్యటన జోష్ నింపింది. మరోవైపు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులకు కూడా దిశా నిర్దేశం చేయడం కేడర్‌కు నూతనోత్తేజాన్నిచ్చింది.
9 రోజులు.. 375 కిలోమీటర్లు
Published Wed, Mar 26 2014 12:05 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement