సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాకు విచ్చేసిన వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మధిర, ఇల్లెందులలో నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ మీదుగా మధిర మండలం శివాపురం శివారుకు విజయమ్మ సోమవారం సాయంత్రం 4.45 గంటలకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు, మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ సామాన్య కిరణ్‌లు విజయమ్మకు సాదర స్వాగతం పలికారు. అక్కడినుంచి మడుపల్లిశివారుకు చేరుకున్న విజయమ్మను డప్పు వాయిద్యాలతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతించారు. మడుపల్లి గ్రామంనుంచి రోడ్‌షో నిర్వహించారు.
గ్రామ సెంటర్‌లో జనసందోహం మధ్య ఆమె ప్రసంగిస్తుండగా వైఎస్‌ఆర్ అమర్హ్రే.. జై జగన్ నినాదాలు మిన్నంటాయి. మడుపల్లి మీదుగా మధిర వరకు రోడ్‌షోకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. మధిర శివారు ఎస్‌సీ కాలనీకి సాయంత్రం 6 గంటలకు చేరుకోగా అప్పటికే అక్కడ పెద్దసంఖ్యలో ఉన్న మహిళలు ప్రచార రథానికి ఎదురేగి ఆహ్వానించారు. మధిరలోని అంబేద్కర్ సెంటర్, కళామందిర్ రోడ్, ఫ్లై ఓవర్, వైఎస్‌ఆర్‌సెంటర్‌తోపాటు మధిర శివారు వరకు రోడ్‌షోలో ఇరువైపులా ప్రజలు బారులు తీరడంతో అభివాదం చే స్తూ విజయమ్మ ముందుకు కదిలారు.
రోడ్‌షో మధిర అంబేద్కర్ సెంటర్‌కు చేరుకోవడానికి ముందే మహిళలు అధిక సంఖ్యలో కూడలి వద్దకు చేరుకున్నారు. మార్కెట్ ఏరియాలో మహిళలు, వ్యాపారులు పెద్ద ఎత్తున భవనాలపై నుంచి విజయమ్మ ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. మధిరలో రాత్రి 7.40 గంటల వరకు ఆమె పర్యటన జనప్రవాహం మధ్యలో కొనసాగింది. రెండు గంటలపాటు మధిరలో ఆమె రోడ్‌షో నిర్వహించారు. అక్కడి నుంచి వైరా, ఖమ్మం మీదుగా రాత్రి 9 గంటలకు ఇల్లెందు చేరుకున్నారు.
జనసంద్రమైన ఇల్లందు..
విజయమ్మ రోడ్‌షోకు భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో ఇల్లెందు జనసంద్రమైంది. కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి పాతబస్టాండ్ సెంటర్ వరకూ ఎటు చూసినా జనమే కనిపించారు. పాతబస్టాండ్ సెంటర్‌లో ఆమె ప్రసంగిస్తుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తుండగా వైఎస్‌ఆర్ అమర్ రహే నినాదాలను చేశారు. ఇల్లెందు పట్టణంతోపాటు బయ్యారం, గార్ల, టేకులపల్లి నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. డప్పు వాయిద్యాలతో, వైఎస్‌ఆర్ సీపీ జెండాలతో ఇల్లెందులో జాతర వాతావరణం నెలకొంది.
ఆకట్టుకున్న విజయమ్మ ప్రసంగం...
మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాాలతో పేదప్రజలకు లబ్ధి చేకూరిన వైనం.. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు పడ్డ కష్టాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ.. విజయమ్మ ప్రసంగాన్ని కొనసాగించారు. మధిరలోని అంబేద్కర్ సెంటర్, వైఎస్‌ఆర్ విగ్రహం సెంటర్, ఇల్లెందు పాతబస్టాండ్ సెంటర్‌లలో ఆమె నాటి, నేటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేస్తూ, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన తీరును వివరిస్తూ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. చంద్రబాబు 108తో ప్రజల ప్రాణాలు కాపాడారా..? ఆరోగ్యశ్రీతో పేదవానికి ఉచితంగా ఆపరేషన్ చేయించారా..? పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారా..? డ్వాక్రా మహిళల రుణాలను, రైతుల రుణాలను మాఫీ చేశారా.? అంటూ ఒక్కొక్కటిగా వైఎస్ అమలు చేసిన పథకాలను ఉటంకిస్తూ.. వాటిలో ఏఒక్కటయినా చంద్రబాబు నిర్వహించారా అంటూ ప్రజలను విజయమ్మ అడుగుతుంటే.. లేదు.. లేదు అంటూ ప్రజలు సమాధానమిచ్చారు.
కదం తొక్కిన వైఎస్సార్ సీపీ, సీపీఎం శ్రేణులు..
మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్ సీపీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరడంతో.. సీపీఎం శ్రేణులు కూడా వైఎస్ విజయమ్మ రోడ్‌షోలో పాల్గొని కదం తొక్కాయి. మధిర, ఇల్లెందులో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ రోడ్ షోలో కదిలారు. మున్సిపల్ ఎన్నికల్లో మిత్రపక్ష అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజయమ్మ పిలుపునివ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంతో మిత్రపక్షాల ఐక్యత వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలోపు ఇల్లెందులో విజయమ్మ రోడ్‌షోను ముగించుకుని రోడ్డు మార్గాన పాల్వంచ చేరుకున్నారు.
అక్కడ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త యడవల్లి కృష్ణ నివాసంలో ఆమె బస చేశారు. మంగళవారం ఉదయం కొత్తగూడెం నుంచి ఆమె రోడ్‌షో ప్రారంభం కానుంది. అనంతరం సత్తుపల్లి మున్సిపల్ ఎన్నిక ల ప్రచారంతో ఖమ్మం జిల్లా పర్యటన ముగియనుంది. ఈ రోడ్‌షోలో వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు, మధిర నియోజకవర్గ సమన్వయకర్త సామాన్య కిరణ్, ఇల్లెందు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ రవిబాబు నాయక్, ఖమ్మం నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగభూషణం, యువజన విభాగం మూడు జిల్లాల కన్వీనర్ సాధు రమేష్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మెండెం పుష్పలత, ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎండీ శంషాద్, సీపీఎం మధిరడివిజన్ కార్యదర్శి పున్నం వెంకటేశ్వర్లు, నేతలు నెరువు సత్యనారాయణ, పిట్లలరవి తదితరులు పాల్గొన్నారు.
నీరాజనం
Published Tue, Mar 25 2014 2:57 AM | Last Updated on Mon, Jan 7 2019 8:29 PM
Advertisement