బాబు పెద్ద అవకాశవాది: వైఎస్సార్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది ఆకాశమంత అవకాశవాదమని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో విభజన డిమాండ్ చేయిస్తూ, సీమాంధ్ర వారితో సమైక్య నినాదాలు వినిపిస్తున్న చంద్రబాబు దోబూచులాట తేటతెల్లమవుతోందని దుయ్యబట్టింది. బాబుది అవకాశవాదమైతే, కిరణ్‌ది బూటకపు సమైక్యవాదమని ధ్వజమెత్తింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని మొదట్నుంచీ చెబుతున్న దానికే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది.
పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి,అమరనాథరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డితో కలసి గొల్ల బాబూరావు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘‘విభజన వల్ల కలిగే నష్టాలను గ్రహించి ఇకనైనా కళ్లు తెరవండి. అని మా శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ సీఎం,ప్రతిపక్ష నేతను కోరారు. కానీ, వారిద్దరూ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసేందుకు సంఘీభావం తెలుపలేదు. ఆ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలనే డిమాం డ్‌కు అంగీకరించనందునే మా పార్టీ వాకౌట్ చేసింది’’ అని వివరించారు.