విమాన టికెట్లపైనా ఇక సెస్ !
- త్వరలో కొత్త పౌర విమానయాన విధానం
న్యూఢిల్లీ: విమాన టికెట్లపై 2 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో ప్రభుత్వం వెలువరించే కొత్త పౌర విమానయాన విధానంలో ఈ మార్పు చోటు చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సుంకం నిధులతో మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులను నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. కాగా ఈ కొత్త పౌర విమానయాన విధానంపై తుది కసరత్తు జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు.
ఈ రంగం వృద్ధికి దీర్ఘకాల వ్యూహాన్ని ఈ విధానం అందిస్తుందని వివరించారు. పరిశ్రమకు సంబంధించి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. కాగా కొన్ని విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలను ఇష్టారాజ్యంగా వసూలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని ఇదే సమావేశంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారని శర్మ తెలిపారు. అత్యవసర సమయాల్లో విమానయాన సంస్థలు విమాన ధరలను పెంచుతున్నాయని, వైద్యపరమైన అత్యవసర సమయాల్లో ధరలను పెంచడానికి బదులుగా తగ్గించాలని పేర్కొన్నారు.