ఈ నెల నుంచే ఐడియా 4జీ సర్వీసులు..
తెలుగు రాష్ట్రాల్లో 122 పట్టణాల్లో... మొదలైన ప్రీ-బుకింగ్ రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులార్ డిసెంబరులోనే 4జీ ఎల్‌టీఈ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తోంది. నెట్‌వర్క్ పనితీరుపై సాంకేతిక పరీక్షలను దాదాపు పూర్తి చేసింది. రిలయన్స్ జియో కంటే ముందే 4జీ మార్కెట్లో ప్రవేశించే దిశగా కంపెనీ ఏర్పాట్లను వేగిరం చేసింది. అటు ప్రీ-బుకింగ్ ఆఫర్‌ను ప్రారంభించింది. పేరు నమోదు చేసుకున్న కస్టమర్‌కు సర్వీసులు ప్రారంభం అయ్యాక 10 రోజుల కాలపరిమితి ఉండే 1 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. కాగా, ఐడియా సెల్యులార్ తొలుత 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి) సర్కిల్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్ మరియు చత్తీస్‌గఢ్, పంజాబ్, ఒడిషా, తమిళనాడు సర్కిళ్లలో 4జీ మార్కెట్లో ప్రవేశిస్తోంది.
చిన్న పట్టణాల్లోనూ..
చిన్న పట్టణాల్లో డేటా వినియోగం జోరుగా ఉండడం, 4జీ స్మార్ట్‌ఫోన్లు రూ.4,500 నుంచి లభిస్తుండటంతో ఐడియా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బండిల్ ఆఫర్ల కింద దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనుందని సమాచారం. డేటా చార్జీలు మార్కెట్ ధరలకు పోటీనిచ్చేలా ఉంటాయని ఐడియా ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు శుక్రవారం వెల్లడించారు.
122 పట్టణాల్లో 4జీ...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో కంపెనీ 122 పట్టణాల్లో 4జీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ప్రధాన పట్టణాలైన హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, కడప, తిరుపతి, రాజమండ్రితోపాటు అన్ని జిల్లా కేంద్రాలు వీటిలో ఉన్నాయి.