ఏవియేషన్ వృద్ధిలో విమానాశ్రయాలే కీలకం
న్యూఢిల్లీ: ఏ దేశంలోనైనా పౌర విమానయాన రంగం వృద్ధికి మెరుగైన మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలే కీలకమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు. జీఎంఆర్ గ్రూప్ సారథ్యంలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(డీఐఏఎల్) వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. మెరుగైన నిర్వహణ, సాంకేతికంగా అత్యాధునిక సేవలు మొదలైన వాటికి భవిష్యత్‌లోనూ డీఐఏఎల్ పెద్ద పీట వేయాలన్నారు. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితర కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏటా 6.2 కోట్ల మంది ప్రయాణికులు, 1.5 మిలియన్ టన్నుల సరకు రవాణా సామర్ధ్యంతో ఢిల్లీ విమానాశ్రయం సేవలందిస్తోందని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు.