11 నెలల్లో 67 లక్షల కొత్త కస్టమర్లు
మ్యూచువల్ ఫండ్స్‌కు పెరుగుతున్న ఆదరణ
⇒ 5.4 కోట్లకు ఫోలియోలు
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఆదరణ గణనీయంగా పెరిగిపోతోంది. భారీ సంఖ్యలో ఇన్వెస్టర్లు కొత్తగా వచ్చి చేరుతున్నారు. మార్చితో ముగిసిన క్రితం ఆర్థిక సంవత్సరం(2016–17)లోని మొదటి 11 నెలల్లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో నికరంగా 67 లక్షల కొత్త ఫోలియోలు (ఇన్వెస్టర్లకు కేటాయించే నంబర్) తోడయ్యాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఫోలియోలు 5.4 కోట్లకు వృద్ధి చెందడం విశేషం. 2015–16 ఆర్థిక సంవత్సరంలోనూ ఇలా కొత్తగా వచ్చి చేరిన వారి సంఖ్య 59 లక్షలు. చివరి రెండు సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో చేరిన కొత్త ఖాతాదారుల్లో ఎక్కువ మంది చిన్న పట్టణాల నుంచే ఉండడం పెరుగుతున్న అవగాహనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఫోలియో అన్నది ఇన్వెస్టర్లకు కేటాయించే ఓ గుర్తింపు నంబర్.దీని ఆధారంగా పెట్టుబడులు కొనసాగుతాయి.
ఒక్కో ఇన్వెస్టర్‌కు ఎన్ని ఫోలియోలు అయినా ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం... 43 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో మొత్తం ఫోలియోల సంఖ్య 2016 మార్చి నాటికి 4,76,63,024గా ఉండగా, ఆ సంఖ్య 2017 ఫిబ్రవరి నాటికి 5,43,87,930కు పెరిగింది. దీంతో నికరంగా పెరిగిన ఫోలియోలు 67.25 లక్షలు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం పెరగడం, అందులోనూ చిన్న పట్టణాల నుంచి అధికంగా ఉండడం, ఈక్విటీ పథకాల్లోకి భారీగా పెట్టుబడుల రాక వృద్ధికి చోదకాలుగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2016 ఏప్రిల్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కొత్తగా చేరిన 67.25 లక్షల ఫోలియోల్లో రిటైల్ ఇన్వెస్టర్లవి 40 లక్షలకు పైనే ఉన్నాయి. దీంతో మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోలు 4 కోట్లను చేరినట్టు లెక్క.