ఎక్కడండీ.. ఏటీఎం? | Online banking leads to decrease in ATM numbers globally | Sakshi
Sakshi News home page

ఎక్కడండీ.. ఏటీఎం?

Published Wed, May 22 2019 12:11 AM | Last Updated on Wed, May 22 2019 4:53 AM

 Online banking leads to decrease in ATM numbers globally - Sakshi

సాక్షి, బిజినెస్‌ విభాగం: పెద్ద నోట్ల రద్దు తర్వాత మూగబోయిన ఏటీఎంలు ఆ తర్వాత కాలంలో వినియోగంలోకి వచ్చినా కానీ, ఎందుకో గతంలో మాదిరిగా విరివిగా అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరవాత గత రెండు సంవత్సరాల కాలంలో నగదు లావాదేవీలు పెరిగిపోగా, ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆర్‌బీఐ తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. బ్రిక్స్‌ దేశాల్లో ఒక్క భారత్‌లోనే లక్ష మంది ప్రజలకు అతి తక్కువ ఏటీఎంలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోవటానికి అసలు కారణం వాటిపై బ్యాంకులు చేస్తున్న ఖర్చులు పెరిగిపోవటమేనని తెలుస్తోంది. ఆర్‌బీఐ నిర్దేశించిన కఠిన నియమ, నిబంధనలకు తోడు... లావాదేవీలకు అవుతున్న చార్జీలను కస్టమర్ల నుంచి పూర్తి స్థాయిలో రాబట్టుకోలేకపోవడం, ఏటీఎం కేంద్రం నిర్వహణ, సెక్యూరిటీ ఖర్చు వెరసి బ్యాంకులకు ఆర్థికంగా భారం కావడంతో, దాన్ని తగ్గించుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. గతేడాది సాఫ్ట్‌వేర్, ఎక్విప్‌మెంట్‌ల ఆధునికీకరణ కోసం ఆర్‌బీఐ ఆదేశించడం వల్ల ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరిగిపోయింది. దీంతో రానున్న కాలంలోనూ ఏటీఎంల క్షీణత ఉంటుందని అంచనా.  

పెరిగిన వినియోగం... 
‘‘ఏటీఎంల సంఖ్య తగ్గడం ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పిరమిడ్‌లో సామాజిక, ఆర్థికంగా దిగువవైపున ఉండే వారిపై ఈ ప్రభావం ఉంటుంది’’ అని ఏటీఎం మెషీన్ల సరఫరా కంపెనీ హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ ఎండీ రస్టోమ్‌ ఇరానీ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఏటీఎంల విస్తరణ చాలా తక్కువగా ఉందని ఇరానీ పేర్కొన్నారు. వ్యయాలు పెరిగిపోవటమనేది ఏటీఎంల నిర్వహణపై బ్యాంకులను ఆలోచనల్లో పడేస్తోంది. ఎందుకంటే లావాదేవీలపై విధించే ఫీజు ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది. పరిశ్రమ కమిటీ ఆమోదం లేనిదే ఈ ఫీజులను పెంచే పరిస్థితి లేదు. బ్యాంకులు, థర్డ్‌ పార్టీ సంస్థలు మన దేశంలో ఏటీఎంలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్‌చేంజ్‌ ఫీజుగా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుతో నగదు ఉపసంహరణ లావాదేవీపై ఇవి రూ.15ను వసూలు చేస్తున్నాయి. ఇంటర్‌చేంజ్‌ ఫీజు ఏటీఎంల వృద్ధి ఆగిపోవడానికి ప్రధాన కారణమని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ తెలిపారు. బ్యాంకులు తాము సొంతంగా ఏటీఎంలను నిర్వహించడం కంటే వేరే బ్యాంకులకు ఇంటర్‌చేంజ్‌ ఫీజు చెల్లించడం చౌకగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఫీజులను పెంచడం పరిష్కారమని అందరూ భావించడం లేదని, ఒకవేళ ఫీజులు పెంచితే ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్లకే బదిలీ చేస్తాయని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు సీఈవో ఆర్‌.సుబ్రమణ్యకుమార్‌ పేర్కొన్నారు. 

పెరుగుతున్న  డిజిటల్‌ లావాదేవీలు 
మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్‌ లక్ష్యాల్లో డిజిటల్‌ లావాదేవీల పెంపు కూడా ఒకటి. మోదీ సర్కారు చేపట్టిన జన్‌ధన్‌ యోజన తదితర కార్యక్రమాల ఫలితంగా 2014 తర్వాత 35 కోట్ల మందికి పైగా కొత్తగా బ్యాంకు సేవలకు అనుసంధానమయ్యారు. దీంతో ఏటీఎం వంటి కనీస ఆర్థిక సేవల అందుబాటు కీలకంగా మారింది. ఏటీఎంల సంఖ్య తగ్గుముఖానికి ఇతర అంశాలూ కనిపిస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణ మరో ప్రధాన అంశం. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం  కూడా ఏటీఎంలు తగ్గడానికి కారణం. ఇక దేశంలోని ప్రతి రెండు ఏటీఎంలలో ఒకటి బ్యాంకు శాఖల వద్ద ఉన్నదే. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ 2018 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏకంగా 1,000 ఏటీఎంలను తగ్గించుకోవడం గమనార్హం. డిజిటలైజేషన్‌ పెరిగిపోవడం, మొబైల్, ఇంటర్నెట్‌ వ్యాప్తి సామాన్యులకూ చేరువ కావడంతో భవిష్యత్తులో బ్యాంకులు శాఖలపై ఆధారపడడం తగ్గిపోనుందని ఎస్‌బీఐ ఎండీ దినేష్‌కుమార్‌ ఖరా తెలిపారు. మొబైల్‌ యాప్స్‌ను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు పెరుగుతున్నట్టు ఫెడరల్‌బ్యాంకు సీఎఫ్‌వో అశుతోష్‌ఖజూరియా తెలిపారు. గత ఐదేళ్లలో మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు 65% పెరిగాయి. మొబైల్‌ బ్యాం కింగ్‌ జోరుతో ఏటీఎంల సంఖ్య ఇక ముందూ తగ్గనుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement