27 నుంచి ఏడో విడత బంగారు బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: సౌర్వభౌమ బంగారు బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 27న ప్రారంభం కానుండగా మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక్కరు 500 గ్రాముల బంగారం విలువకు సరిపడా సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ.20వేల వరకు నగదు రూపంలో చెల్లించడానికి అవకాశం ఉంది. అంతకుమించితే డీడీ లేదా చెక్ లేదా నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి విడత జారీ. ‘‘ఆర్‌బీఐతో ప్రభుత్వం సంప్రదించిన అనంతరం సౌర్వభౌమ బంగారు బాండ్లు 2016–17 ఏడో సిరీస్ విడుదల చేయాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది. అర్హులైన దరఖాస్తుదారులకు మార్చి 17న బంగారు బాండ్లను కేటాయిస్తారు. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రత్యామ్నాయ సాధనంగా సౌర్వభౌమ బంగారు బాండ్ల పథకాన్ని ప్రభుత్వం 2015 నవంబర్‌లో తొలిసారిగా ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు బాండ్లను జారీ చేసింది. ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ వీటిని జారీ చేస్తుంది. వీటిపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి ప్రభుత్వం చెల్లిస్తుంది. బాండ్ల కాల వ్యవధి 8 ఏళ్లు కాగా, ఐదో ఏట నుంచి వైదొలగేందుకు అవకాశం ఉంది. ఈ బాండ్లు స్టాక్ ఎక్సేS్చలలో ట్రేడ్ అవుతాయి.