రేపటి ఇంటర్వ్యూ ఈరోజే...! | test my interview startup dairy special story | Sakshi
Sakshi News home page

రేపటి ఇంటర్వ్యూ ఈరోజే...!

Published Fri, Mar 25 2016 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

రేపటి ఇంటర్వ్యూ ఈరోజే...!

రేపటి ఇంటర్వ్యూ ఈరోజే...!

మాక్ ఇంటర్వ్యు  సేవలు అందిస్తున్న టెస్ట్ మై ఇంటర్వ్యు
ఉద్యోగాలకు దారి చూపిస్తున్న హైదరాబాదీ స్టార్టప్
6 నెలల్లోనే ఆఫ్‌లైన్‌లో 8 వేలు..
ఆన్‌లైన్‌లో 3 వేల మందికి  సేవలు
‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ శ్రీధర్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ‘మాక్ డ్రిల్స్’!! అదేనండీ..! ప్రమాదం జరిగితే దాన్నుంచెలా తప్పించుకోవాలి? ఎలాంటి సురక్షిత చర్యలు తీసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించేవి. దీనికోసం నిజంగా ప్రమాదాన్ని సృష్టించి.. డెమో రూపంలో మెళకువలు నేర్పిస్తారిక్కడ. అచ్చం ఇలాంటి మాక్ డ్రిల్స్‌నే.. ఇంటర్వ్యూలకు అన్వయిస్తే!! అంటే రేపు మనం ఎదుర్కోబోయే కంపెనీ ఇంటర్వ్యూను.. ఈ రోజే ఓ డెమో ఇస్తే! రేపు మనల్ని ఇంటర్వ్యూ చేసే నిపుణుల్లాంటివారేఈ మాక్ ఇంటర్వ్యూలో ఉంటే!! ఇదెలా కుదురుతుందనుకుంటున్నారా? ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ’ అందిస్తున్నది ఈ సేవల్నే. ఉద్యోగానికి, ఇంటర్వ్యూకు మధ్యనున్న ఖాళీని భర్తీ చేయడమే దీని పని.

 విద్యార్థి-హెచ్‌ఆర్ పరస్పరం ఆధారపడిన ఈ రోజుల్లో... రెండింటినీ అనుసంధానిస్తూ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది థింక్ డిజిటల్ సర్వీసెస్థ్. ఈ సంస్థ ఫ్లాగ్ షిప్ ప్రొడక్టే ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ.కామ్’. అమెరికా, ఇండియాలో మైక్రోసాఫ్ట్‌లో పదేళ్లకు పైగా పనిచేసిన కె.శ్రీధర్... మునుపటి సత్యం కంప్యూటర్స్‌లో పదేళ్ల పైగా అనుభవమున్న మరో మిత్రుడితో కలిసి హైదరాబాద్ కేంద్రంగా థింక్ డిజిటల్‌ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు శ్రీధర్ మాటల్లోనే...

 ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం అంత తేలికైన విషయమేమీ కాదు. దేశంలో 90 శాతం మంది ఉద్యోగార్థులు ఫెయిలవుతున్నదెక్కడో తెలుసా..?  ఇంటర్వ్యూలోనే! సబ్జెక్ట్ పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్ ఉండి కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతున్నారు. కారణమేంటంటే... పెద్ద కంపెనీల్లో ఇంటర్వ్యూ విధానం తెలియకపోవడం! ఇక నిపుణుల ముందు కూర్చునే సరికి లోలోపల తెలియని భయం ఏర్పడటం మరో కారణం. దీనికి పరిష్కారం చూపించడమే టెస్ట్ మై ఇంటర్వ్యూ ప్రత్యేకత. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించే యువతకు... నేరుగా పేరొందిన ఐటీ కంపెనీల ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు, ఆ స్థాయికి సమానమైన వారి చేత మాక్ ఇంటర్వ్యూలు చేయిస్తాం. వీటిలో అభ్యర్థులు ఎలాంటి తప్పొప్పులు చేస్తున్నారో అక్కడికక్కడే చెప్పేస్తారు కూడా. దీంతో అసలు ఇంటర్వ్యూలకు వంద శాతం కాన్ఫిడెన్స్‌తో వెళ్ళొచ్చు. అందుకే ‘మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ముందే.. మీరే ఇంటర్వ్యూ చేయించుకోండి’ అనే నినాదంతో మార్కెటల్లోకి వచ్చాం.

 100 కంపెనీలు.. 800 మంది నిపుణులు: ప్రస్తుతం టెస్ట్ మై ఇంటర్వ్యూ సంస్థ విప్రో, మైక్రోసాఫ్ట్, సత్యం, కాగ్నిజెంట్, టీసీఎస్.. ఇలా అమెరికా, ఇండియాలోని సుమారు 100కు పైగా కంపెనీల్లో పనిచేస్తున్న 800 మంది సీనియర్ ఉద్యోగులు, ఇంటర్వ్యూ బోర్డ్ నిపుణులతో ఒప్పందం చేసుకుంది. జావా, డాట్ నెట్, ఏఎస్‌పీ, శాప్, ఒరాకిల్ డేటాబేస్.. ఇలా అన్ని టెక్నాలజీల పైనా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అభ్యర్థుల్లో బాగా తెలివైన వారెవరు? అప్పటికప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించినా  సెలక్ట్ కాగలిగే సామర్థ్యం ఎవరెవరికి ఉంది? కాస్త కష్టపడి ప్రిపేరైతే ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొనే సామర్థ్యం ఎందరికుంది? ఇలా అన్ని రకాలుగా విశ్లేషించి నివేదికలు రూపొందిస్తున్నాం.

 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలూ లభిస్తాయ్...
1. ఆన్‌లైన్, స్కైప్‌లో సేవలు పొందాలంటే.. ముందుగా అభ్యర్థులు టెస్ట్ మై ఇంటర్వ్యూ.కామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రూ.500 ఫీజుతో అసలు ఇంటర్వ్యూ కంటే కనీసం రోజుల ముందు రిజిస్టర్ చేసుకోవాలి. అసలు ఇంటర్వ్యూ నిర్వహించే బోర్డ్ మెంబర్లు లేదా ఆ స్థాయి వ్యక్తులు ఒక రోజు ముందు ఆన్‌లైన్‌లో 45 నిమిషాల పాటు మాక్ ఇంటర్వ్యూ చేస్తారు. 15 నిమిషాల ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 3 వేల మందికి పైగా ఈ సేవలు పొందారు.

 2. ఆఫ్‌లైన్‌కు వచ్చేసరికి... మమ్మల్ని సంప్రదించిన కాలేజీకి 20 మంది ఇంటర్వ్యూ సభ్యుల బృందాన్ని పంపిస్తాం. ఈ బృందం 6, 7వ సెమిస్టర్ విద్యార్థులకు ‘రియల్ టైమ్ ఇంటర్వ్యూ’లు నిర్వహిస్తాం. అభ్యర్థులపై వివరంగా నివేదికలిస్తాం. దీంతో సదరు మేనేజ్‌మెంట్‌కు విద్యార్థులపై దృష్టి పెట్టడంతో పాటు వారిని క్యాంపస్ ఇంటర్వ్యూలకు పంపే వీలుంటుంది. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, ఒడిస్సాలోని సీవీర్, సీఎంఆర్, వర్ధమాన్ సహా పలు కాలేజీల్లో 8 వేల మందికిపైగా విద్యార్థులకు రియల్ టైమ్ ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఇప్పటివరకు 5 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. చార్జీల విషయానికొస్తే.. ఇం టర్యూలు, నివేదికలు.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో చార్జీ ఉంటుంది.

3 . నెలల్లో మార్కెట్లోకి పోల్...
మా సంస్థ నుంచి మరో 3-4 నెలల్లో ‘పోల్’ పేరిట కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తెస్తున్నాం. ఇది సామాన్య ప్రజల కోసం. స్మార్ట్‌ఫోన్లో మాత్రమే పనిచేస్తుంది. ఇదేంటంటే.. మనకు నచ్చిన సినిమా, ఫుడ్ ఇలా దేనిపై అయినా పోల్ చేయవచ్చు.. డిస్కషన్ కూడా చేయవచ్చు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే
startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement