గోల్డ్ బాండ్లు.. పెట్టుబడులకు బంగారం | The Chinese Are Buying Gold, Selling Treasuries - Should You? | Sakshi
Sakshi News home page

గోల్డ్ బాండ్లు.. పెట్టుబడులకు బంగారం

Published Mon, Sep 5 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

గోల్డ్ బాండ్లు.. పెట్టుబడులకు బంగారం

గోల్డ్ బాండ్లు.. పెట్టుబడులకు బంగారం

ఎన్నో ఏళ్లుగా భారతీయులకు పసిడి ఒక పెట్టుబడి సాధనమే. పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు, కరెన్సీ ఒడిదుడుకుల సందర్భంలో ఆర్థిక రక్షణ కవచంగా బంగారాన్ని చూస్తారు.  బంగారానికి గృహ వినియోగదారులు ఇస్తున్న ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌జీబీ) పథకాన్ని 2015 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అదే ఏడాది అక్టోబర్ 30న పథకం ప్రారంభమైంది. 

పసిడికి భౌతికంగా డిమాండ్ తగ్గించడం తద్వారా దిగుమతులకు సంబంధించి క్రూడ్ తరువాత రెండవ స్థానంలో ఉన్న ఈ మెటల్ దిగుమతిని కట్టడి చేయడం, దేశంలోకి వచ్చీ,పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం- కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి, తద్వారా రూపాయి విలువ స్థిరీకరణ వంటి ఎన్నో అంశాలూ ఈ పథకం ప్రవేశపెట్టడానికి కారణమయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా సెప్టెంబర్ 1 నుంచీ ప్రారంభమైన  ఐదవ విడత గోల్డ్ బాండ్ పథకం 9వ తేదీన ముగుస్తుంది. ఇప్పటి వరకూ పూర్తయిన 4 విడతల్లో ఈ పథకానికి స్పందన సంతృప్తికరంగా ఉంది.  నాలుగో విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం రూ.919 కోట్లు సమీకరించింది. మొత్తం నాలుగు విడతల్లో  రూ. 2,292 కోట్ల విలువైన పెట్టుబడులను సేకరించింది.
- సునీతా ఆనంద్, రీజినల్ హెడ్, ఎన్‌ఎస్‌ఈ

ఇప్పుడు అందుబాటులో...
సెప్టెంబర్ 1 నుంచీ ప్రారంభమైన  ఐదవ విడత గోల్డ్ బాండ్ పథకం 9వ తేదీన ముగుస్తుంది.

బాండ్ల జారీ 23 వ తేదీన జరుగుతుంది. 

కేంద్ర ప్రభుత్వం తరుఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను జారీ చేస్తుంది.

తాజా ఇష్యూ ధర గ్రాముకు రూ.3,150.

బాండ్ల తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం.

ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి.

గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. 

ఏడాదికి ఒకరు 500 గ్రాముల వరకూ పసిడిని కొనుగోలు చేసే వీలుంది.
బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

 క్యాష్ ఎప్పుడు కావాలంటే అప్పుడు...
జారీ అయిన బాండ్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ట్రేడవుతాయి. ఇప్పటికి పూర్తయిన నాలుగు విడతల్లో మూడు విడతల బాండ్ల ట్రేడింగ్ ప్రారంభమయ్యిం ది.  తమ బాండ్లను నగదుగా మార్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లు ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్  ట్రేడింగ్ మెంబర్స్ ద్వారా తమ హోల్డింగ్స్‌ను వేరే ఇన్వెస్టర్‌కు విక్రయించవచ్చు. లేదా ఐదేళ్ల వరకూ వేచివుండి ప్రభుత్వం ద్వారా తమ బాండ్లకు తగిన సొమ్మును తిరిగి పొందవచ్చు. లేదా ఎనిమిది సంవత్సరాల తర్వాత బాండ్ కాలపరిమితి మామూలుగానే ముగుస్తుంది.

అమెరికా ఆర్థిక బలహీనతే.. పసిడికి బలిమి!
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తాజా పరిణామాల్ని ఉదహరిస్తున్నారు. ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణిలో ఉన్న  అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంచవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో వారం చివరి వరకూ మందగమనంలో నడిచిన పసిడి, శుక్రవారం అందిన అమెరికా ఉద్యోగ డేటా ఆగస్టు అంచనాలకు భిన్నంగా నిరాశాపూరితంగా ఉండడంతో ఒక్కసారిగా పరుగుపెట్టింది.

న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారం నాడు అంతక్రితం ధరతో పోల్చితే 11 డాలర్లు ఎగసి 1328 డాలర్లకు చేరింది. దీనితో వారం వారీగా చూస్తే 4 డాలర్లు లాభపడినట్లయ్యింది. ఉపాధి అవకాశాలు తగ్గడం- ఫెడ్ ఫండ్ రేటు పెంపుదల అవకాశాలు సన్నగిల్లడమేనన్న అంచనాలు పసిడికి బలాన్ని ఇచ్చాయి. ఆగస్టులో ఉపాధి అవకాశాల సంఖ్య 1,80,000 అని భావిస్తే... ఈ సంఖ్య కేవలం 1,51,000కు మాత్రమే పరిమితమయ్యింది. ఉపాధి కల్పనా రేటు 4.9 శాతంగా యథాతథంగా కొనసాగింది. దీనిని బట్టి అమెరికా ఆర్థిక పరిణామాలే పసిడికి  దిశానిర్దేశమని నిపుణులు భావిస్తున్నారు.

దేశీయంగా చూస్తే...
పసిడి వారం అంతా దేశీయంగా బలహీనంగానే నడిచింది. వారం వారీగా 99.9 స్వచ్ఛత పసిడి ముంబై ప్రధాన మార్కెట్‌లో 10 గ్రాములకు రూ.390 తగ్గి రూ.30,995 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.30,845కు పడింది. ఇక వెండి కేజీ ధర మాత్రం రూ.415 లాభపడి రూ.45,300కు చేరింది. పారిశ్రామికంగా డిమాండ్ కొంత మెరుగుపడ్డమే దీనికి కారణమన్న విశ్లేషణ ఉంది.

పన్ను ప్రయోజనాలు...
బాండ్ వడ్డీపై సోర్స్ వద్ద వడ్డీ కోత (టీడీఎస్) ఉండదు. మెచ్యూరిటీకి ముందే బాండ్ ట్రాన్స్‌ఫర్ అయితే ఇండెక్సేషన్ ప్రయోజనాలు లభ్యమవుతాయి. మూడేళ్ల తరువాత దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది. గడువుదాకా ఉంచుకుంటే మాత్రం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడబోదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement