బ్యాంకింగ్ సంస్కరణలే లక్ష్యం | The goal of the banking reform | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్ సంస్కరణలే లక్ష్యం

Published Sat, Jan 3 2015 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

బ్యాంకింగ్ సంస్కరణలే లక్ష్యం

బ్యాంకింగ్ సంస్కరణలే లక్ష్యం

జ్ఞాన సంగం సదస్సులో విస్తృతస్థాయిలో చర్చలు
మొండి బకాయిలు, విలీనాలు తదితర
ఆరు కీలక అంశాలపై దృష్టి
సంస్కరణల బ్లూప్రింట్‌ను నేడు ప్రధాని మోదీకి సమర్పించనున్న బ్యాంకింగ్ నిపుణులు

 
పుణే: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు, ఆర్థిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ‘జ్ఞాన సంగం’ సదస్సులో సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక(బ్లూప్రింట్) రూపుదిద్దుకుంటోంది. శుక్రవారమిక్కడ ప్రారంభమైన ఈ రెండు రోజుల సదస్సులో 100 మందికి పైగా బ్యాంకర్లు, నిపుణులు విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సంస్కరణల బ్లూప్రింట్‌ను నేడు ప్రధాని మోదీకి సమర్పించనున్నారు. పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీలు, ఆర్‌బీఐ అధికారులు, ప్రైవేటు రంగానికి  చెందిన నిపుణులు చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న మొండిబకాయిలు(ఎన్‌పీఏలు), రుణ వృద్ధి మందగించడం, బ్యాంకుల మధ్య విలీనాలు, కొనుగోళ్లు(కన్సాలిడేషన్) వంటి కీలక అంశాలపై తగిన పరిష్కార మార్గాల కోసం విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి హస్‌ముఖ్ అధియా పేర్కొన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), టెక్నాలజీ సద్వినియోగం, ప్రాధాన్య రంగ రుణాలు, రిస్క్ మేనేజ్‌మెంట్, పీఎస్‌యూలకు తగిన వ్యూహాల రూపకల్పన, కన్సాలిడేషన్‌లపై ఆరు ప్రత్యేక గ్రూపు లు నివేదికలను తయారు చేయనున్నాయని.. వీటిని నేడు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించనున్నట్లు చెప్పారు.

ఇదో గొప్ప అవకాశం...

 ఈ సదస్సును ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రారంభించారు. తమ ఎన్‌డీఏ ప్రభుత్వం పేదలు, అదేవిధంగా వ్యాపారాలకూ అనుకూలంగా వ్యవహరిస్తుందని చెబుతూ... బ్యాంకులు కూడా ఇదేవిధమైన ధోరణితో ముందుకెళ్లాలని చెప్పారు. తమ వ్యాపారాన్ని లాభదాయకంగా నిర్వహించుకుంటూ నే... పేద ప్రజలు, సామాజిక రంగాలకు కూడా చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని సిన్హా వ్యాఖ్యానించారు. భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు నిలకడగా 7-8 శాతం మేర కొనసాగడానికి తగిన సలహాలు, సూచనలను బ్యాంకర్ల నుంచి ఆయన ఆహ్వానించారు. సదస్సులో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం బాసిన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ వీఆర్ అయ్యర్, కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ ఎస్‌ఆర్ బన్సల్ తదితర బ్యాంకుల అధిపతులతోపాటు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ(పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్, ఆర్‌బీఐ డీప్యూటీ గవర్నర్లు హాజరయ్యారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేడు చర్చల్లో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ సదస్సు ముగింపు ప్రసంగం చేయనున్నారు. కాగా, వచ్చే 10-15 ఏళ్లలో దేశ ఫైనాన్షియల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఈ వినూత్న వర్క్‌షాప్ ఒక అద్భుత అవకాశాన్ని కల్పించిందని సిన్హా వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ కొత్త రూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో సంస్కరణలను తక్షణం, వేగంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు.

విలీనాలొక్కటే మార్గం కాదు...

 పీఎస్‌యూ బ్యాంకుల బలోపేతానికి విలీనాలు, కొనుగోళ్లు ఒక్కటే మార్గం కాదని అధియా పేర్కొన్నారు. మార్కెట్ నుంచి సులువుగా నిధులను సమీకరించేందుకు తగిన యంత్రాంగాన్ని రూపొందించుకోవడం ఇతరత్రా చర్యల ద్వారా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు కూడా మెరుగుపడతాయని ఆర్థిక సేవల కార్యదర్శి హస్‌ముఖ్ అధియా అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనాలను ప్రోత్సహించాలంటూ పలు నివేదికలు వచ్చినప్పటికీ.. ఈ కన్సాలిడేషన్ అంశం చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 27 బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కాగా, కన్సాలిడేషన్‌పై బ్యాంకుల నుంచి కొన్ని సూచనలు వచ్చాయని.. దీనిపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపాల్సి ఉంటుందని అధియా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్య రంగ రుణాల(పీఎస్‌ఎల్) లక్ష్యాలకు సంబంధించి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది వ్యవసాయ రంగ వృద్ధికి ఇప్పుడు చాలా కీలకమైనది. అయితే, పీఎస్‌ఎల్‌లో ఈ రంగానికి చోటు లేదు’ అని అధియా ఉదహరించారు. కాగా, బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడంతో పాటు రుణాలకు డిమాండ్ తగ్గిపోవడం కూడా ఆందోళనకరమైన అంశమేనని అధియా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో రుణ వృద్ధి కేవలం 5.2 శాతానికి  పరిమితమైంది.  2014 సెప్టెంబర్ 30 నాటికి పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) రూ.2.43 లక్షల కోట్లకు చేరాయి.
 
టాప్ పోస్టులకు పైవేటు నిపుణులు!

 పీఎస్‌యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో చైర్మన్, సీఈఓ-ఎండీ పోస్టుల్లో ప్రైవేటు రంగ నిపుణులకు కూడా అవకాశం కల్పించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ పోస్టులకు ప్రైవేటు రంగ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఈ మార్పులకు ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ(ఏసీసీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందని చెప్పారు. యాజమాన్యపరమైన సంస్కరణల్లో భాగంగా పీఎస్‌యూ బ్యాంకుల్లో సీఎండీ పోస్టులను సీఈఓ-ఎండీ, చైర్మన్‌గా ప్రభుత్వం ఇటీవలే విడదీసింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement