సిన్మాలు చూసి.. ఇంటర్నెట్‌లో వెతికి..! | 14 Year Old Boy Kidnapped Child for Cash | Sakshi
Sakshi News home page

సిన్మాలు చూసి.. ఇంటర్నెట్‌లో వెతికి..!

Published Tue, Nov 19 2019 8:21 PM | Last Updated on Tue, Nov 19 2019 8:57 PM

14 Year Old Boy Kidnapped Child for Cash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 14 ఏళ్ల పిల్లాడు ఏడేళ్ల బాలుణ్ని కిడ్నాప్ చెయ్యడం సాధారణ వ్యక్తుల్నే కాదు.. పోలీసుల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందుకే అతన్ని లోతుగా విచారించారు. కిడ్నాప్‌కు తెగించిన నేపథ్యాన్ని తెలుసుకున్నారు. కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చిందని అడిగారు. పోలీసులకు ఏ మాత్రం తడుముకోకుండా ఆ బాలుడు చెప్పిన సమాధానాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి.

సినిమాలను చూసే తాను చోరీలు, కిడ్నాప్ చెయ్యడం నేర్చుకున్నానని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. మీర్‌పేటలో ఏడేళ్ల బాలుణ్ని 14 ఏళ్ల మరో బాలుడు కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పదో తరగతి చదివే బాలుడు మూడు లక్షలు కావాలంటూ మీర్‌పేటలో అర్జున్ అనే పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి మీ కొడుకు నీకు దక్కాలంటే వెంటనే డబ్బు ఏర్పాటు చెయ్యి అని బెదిరించాడు. చివరికి పోలీసులు చైల్డ్ కిడ్నాపర్‌ను ఫేస్‌బుక్ అకౌంట్, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. ఏడేళ్ల అర్జున్­ను సేవ్ చేసి.. కిడ్నాప్‌ కథను సుఖాంతం చేశారు.  

అయితే.. ఈ 14 ఏళ్ల పిల్లాడికి కిడ్నాప్ ఆలోచన ఎలా వచ్చింది. వాడి బుర్రలో ఉంటే చదువు లేదా ఆటపాటలు ఉండాలి. అలాంటిది నేరాలు, ఘోరాలు.. ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఎందుకు ఆలోచించాడు. ముందుగా పోలీసులు అతని నేపథ్యం ఏంటో తెలుసుకున్నారు. గతంలో అతను ఓ ఇంట్లో లక్ష రూపాయలు చోరీ చేసి దొరికిపోయాడట. అప్పటికైనా పెద్దవాళ్లు అతని ఆలోచనల్ని పసిగట్టాల్సింది. ఆ విషయం పోలీసులదాకా వెళ్లకుండా కప్పిపెట్టారు. ఆ దొంగతనాన్ని సెటిల్ చేసుకున్నారు. ఇది జరిగి నెల రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్ తర్వాత పోలీసులు కిడ్నాప్ చేసేంత ధైర్యం నీకు ఎలా వచ్చిందంటూ బాలుడిని ప్రశ్నించారు. సినిమాల్లో హీరోలు చేసే చోరీలను చూసి తాను కూడా డబ్బు కోసం దొంగతనాలు చెయ్యాలని డిసైడయ్యాడట. ఈ క్రమంలోనే వెంటనే ఎక్కువ డబ్బు ఎలా వస్తుందంటూ ఇంటర్ నెట్‌లో వెదుకుతూ వెళ్తే.. కిడ్నాప్ చెయ్యాలని అతనికి తట్టిందట. అలా సినిమాలు.. వీడియోలు చూసిన అనుభవాన్ని ఆచరణలో పెట్టినట్లు బాలుడు చెప్పాడు. అలా వచ్చే డబ్బుతో ఏం చేస్తావ్ అడిగినప్పుడు.. ఛలో ముంబై.. ముంబయి ఎగిరిపోయి... జల్సాగా బతకాలి అన్నాడట. బాలుడి ప్రవర్తనలో ఇంతటి మార్పులకు కారణం అతను చూసే సినిమాలు, వీడియోలేనని పోలీసులు తెలిపారు.

సినిమాలు తీసేవాళ్లకు ఆ సినిమా ఎంత బలమైన మాధ్యమమో.. దాన్ని ఎంతమంది పిల్లలు చూసి నేర్చుకుంటారో అనే బాధ్యత ఉండదు. అమ్మాయిల్ని ఏడిపించే హీరోలను.. చోరీలను చేసే హీరోలను.. గ్యాంగులు మెయిన్ టైన్ చేసి డాన్ లుగా ఎదిగే హీరోలను చూస్తూ మన పిల్లలు పెరుగుతున్నారు. ఎక్కువగా ఏం చూస్తే వాటిని అనుసరించడం పిల్లల సహజ స్వభావం. నేరం అని తెలియకుండా నేరాలు చేసే పిల్లలు.. దొరికిపోతామన్న భయం లేకుండా తీవ్రమైన క్రైమ్స్ చేసే పిల్లలు ఇప్పుడు పెరిగిపోతున్నారు. వాళ్ల అలా మారడానికి కారణం సమాజం. మనముందున్న పరిస్థితులేమిటన్న వాస్తవం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటపడుతోంది. అందుకే పిల్లల్ని రెండు రకాలుగా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల్ని నేరాల బారిన పడకుండా కాపాడుకుంటూనే...  నేరాల వైపు ఆకర్షితులు కాకుండా పెంచడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాంటిదే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement