
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ మాఫియా దాడిలో ఆప్ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. పంజాబ్‌లోని బైహరా గ్రామంలో ఇల్లీగల్ మైనింగ్ వ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రోపార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే అమర్‌జీత్ సింగ్ సందోవా తన అనుచరులతో గురువారం మధ్యాహ్నాం అక్కడికి వెళ్లారు. మీడియాతోపాటు ఆయన్ని గమనించిన ముఠా సభ్యులు ముందుగా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది నిలువరించే యత్నం చేసినప్పటికీ మైనింగ్ మాఫియా ముఠా అస్సలు వెనక్కి తగ్గలేదు. కాసేపటికే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కర్రలు, ఇనుపరాడ్లతో ఎమ్మెల్యే బృందంపై ముఠా సభ్యులు విరుచుకుపడ్డారు. రాళ్లు విసిరి చెదరగొట్టే యత్నం చేశారు. ఈ క్రమంలో రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గాయపడ్డారు. ఛాతీకి బలమైన గాయం కావటంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఈ ఘటనపై ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. పంజాబ్‌లో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరీందర్ సింగ్ ప్రభుత్వం కళ్లు తెరవాలని.. మాఫియా ఆగడాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నామన్న సిసోడియా తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.