హత్యకు గురైన టెక్కీ సురేఖ, శిక్ష పడిన నిందితుడు కుమార రాయ్ (ఫైల్)
కర్ణాటక, యశవంతపుర: టెక్కీని హత్య చేసిన నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. 2010 డిసెంబర్ 17న టెక్కీ పాయల్ సురేఖను జిమ్ ఇన్‌స్ట్రక్టర్ జేమ్స్ కుమార్ రాయ్ జేపీ నగర 6వ స్టేజీ ఆర్‌బీఐ లేఔట్‌లో హత్య చేశాడు. వివరాలు... సురేఖ భర్త అనంత్‌నారాయణ మిశ్రా బెంగళూరు, భువనేశ్వర్‌లో జిమ్ నిర్వహిస్తున్నాడు. బెంగళూరులో పనిచేసే జిమ్‌లో రాయ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడు. సురేఖ సూచనల మేరకు రాయ్‌ను పనిలో నుంచి తొలగించాడు. దీంతో ఆమెపై ద్వేషం పెంచుకుని 2010 డిసెంబర్ 17న దంపతులు ఉంటున్న అపార్టుమెంట్‌కు వెళ్లి సురేఖను హత్య చేశాడు. హత్య చేయటానికి ముందు రెండు మూడు సార్లు నిందితుడు అపార్టుమెంట్‌కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఘటనా స్థలంలో సురేఖ వెంట్రుకలు, రక్తపు మరకలు నిందితుడు ఉపయోగించిన జాకెట్‌పై ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సురేఖను భర్త మిశ్రానే హత్య చేసి ఉంటాడని అనుమానించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయనపై కూడా కేసు పెట్టారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని సురేఖ తల్లిదండ్రులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. బెంగళూరులోనే చదువుకున్న సురేఖ, మిశ్రాలు 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేఖ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ జేపీ నగరలో నివాసం ఉంటోంది. హత్యకేసును సీరియస్‌గా తీసుకున్న సీబీఐ అధికారులు అన్ని ఆధారాలు సేకరించి రాయ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment