కాళేశ్వరం/మహదేవపూర్: కార్తీకమాసం ఏకాదశి ఉదయం 5 గంటల తర్వాత మంచి ముహూర్తం. అప్పుడు చనిపోతే ఆత్మలైనా సంతోషంగా ఉంటాయి. తమ జీవిత చరమాంకంలో సరిగ్గా చూసుకోని కుమారుడు, కోడలికి ఇబ్బందులు రావొద్దనే భావనతో ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, తాము చనిపోయాక అంత్యక్రియల నిమిత్తం ఎవరికీ అవస్థ కలగొద్దని రూ.10 వేల నగదును భర్త తన నడుముకు కట్టుకోగా.. ఇద్దరూ కొత్త బట్టలు ధరించి పురుగుల మందు తాగారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని ఎలికేశ్వరంలో శుక్రవారం జరిగింది.
గ్రామానికి చెందిన సాలయ్య(76), రాధమ్మ(66) దంపతులకు కుమారుడు సత్యం, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉన్న పొలాన్ని కుమారుడికి ఇచ్చి.. వారు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. తరచూ సాలయ్య దంపతులను కుమారుడు, కోడలు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఇరుగుపొరుగు వచ్చే సరికి రాధమ్మ మృతి చెందగా, సాలయ్య కొనఊపిరితో ఉన్నాడు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఒకరిపైన ఆధారపడి బతకొద్దనే తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment