సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో ఎంతటి వాళ్లనైనా వదిలేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కేసును ఏపీ పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసుల పనితీరును సీపీ సజ్జనార్ తప్పుబట్టారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...’ మా పరిధిలో కేసు జరుగుతుంటే ఏపీ పోలీసులు ఇష్టారీతిలో కల్పించుకుంటున్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులను రక్షించేందుకు యత్నిస్తున్నారు.
డేటా చోరీకి పాల్పడ్డ ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు తమవద్దే ఉన్నారని చెప్పినా, వారి కుటుంబసభ్యులను బెదిరించి స్టేట్‌మెంట్ తీసుకోవడమే కాకుండా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మేం విచారించిన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ పోలీసులు ఏం అడిగారని తెలుసుకున్నారు. ఒక మిస్సింగ్ కేసు కోసం ఏసీపీ స్థాయి అధికారి వస్తారా?. ఏపీ పోలీసులు ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు. అంతేకాకుండా డేటా చోరీపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని బెదిరించిన కేసులో ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశాం. అత్యంత సున్నితమైన డేటాను ప్రయివేట్ సంస్థలకు ఎలా ఇస్తారు. ఆ అధికారం ఎవరిచ్చారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించాం. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!)
ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో అశోక్ దాకవరపు తనకు తానుగా లొంగిపోవాలి. చట్టపరంగా దోషులను శిక్షిస్తాం. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా కులాలపరంగా, పథకాల లబ్ధిదారుల పరంగా, ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అనే పూర్తి వివరాల డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. విదేశాల్లో ఉండే నిందితులనే పట్టుకుని స్వదేశానికి తీసుకొస్తున్నాం. అలాంటిది పక్క రాష్ట్రమైన ఏపీలో ఉన్న నిందితులను తెలంగాణకు తీసుకురాలేమా? ఇందుకు బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు.
మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డ ఏపీ పోలీసులపై కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment