సూళ్లూరుపేట వైస్ చైర్మన్ గరిక ఈశ్వరమ్మ
సూళ్లూరుపేట: జిల్లాలోని పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన ఆర్థిక నేరస్తురాలు, సూళ్లూరుపేట వైస్ చైర్మన్ గరిక ఈశ్వరమ్మను జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, గూడూరు డీఎస్పీ రాంబాబుల ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి గురువారం సూళ్లూరుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 14 వరకు రిమాండ్ విధించినట్లు సీఐ నూతలపాటి కిషోర్‌బాబు తెలిపారు. అయితే గత నెల 29న ఈశ్వరమ్మ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయిన విషయం విదితమే. అప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని ఒక రోజుపాటు విచారించి బుధవారం 11 గంటలకు అరెస్ట్ చూపించామని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కోఆపరేటివ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ డి.సుధాభారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను ఈ నెల 22న రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకొచ్చామని తెలిపారు.
అయితే టీడీపీ నేత పరసా వెంకటరత్నయ్య తనకు ఎలాంటి ఫోన్ చేయలేదని, ఎస్సై ఇంద్రసేనారెడ్డికి ఫోన్ చేసి ఆమె అనారోగ్యంతో ఉందని, ఇంటికి పంపితే మరలా వస్తుందని చెప్పిన విషయం వాస్తవమేనని తెలిపారు. దీంతో ఎస్సై తనకు ఫోన్ చేసి పరసా ఫోన్ చేస్తున్నారని, ఏం చేయమంటారని అడగడంతో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని కచ్చితంగా చెప్పానన్నారు. ఈశ్వరమ్మ వాగ్వాదానికి దిగడంతో హోంగార్డు నాగూరమ్మను తోడుగా వెళ్లమని చెప్పి పంపిన విషయం వాస్తవమేనని అన్నారు. ఈశ్వరమ్మ బయటకు వెళ్లగానే హోం గార్డును కసరడంతో ఆమె స్టేషన్ బయటే ఆగిపోయిందని, ఆ తరువాత వారు పరారైన విషయం నిజమేనన్నారు. అప్పటి నుంచి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా ఉన్న వ్యక్తి ఆమెకు సపోర్టుగా పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు కాల్‌లిస్టులో రికార్డయి ఉందని పేర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పది రోజుల ముందే జిల్లా కోఆపరేటివ్ అధికారులు ఆమెపై ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు ప్రారంభించామన్నారు. బ్యాం కుల నుంచి నిధులు తీసుకుని దుర్వినియోగం చేసినందుకు సంస్థ కార్యదర్శి గరిక ఈశ్వరమ్మ, అధ్యక్షురాలు వనితలపై 409, 418, 420, 423 సెక్షన్లతోపాటు ఆర్‌డబ్ల్యూ 34, ఐపీసీ సెక్షన్ 29 క్లాజ్ 2 కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏపీ మ్యూచ్చువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం 1995 ప్రకారం కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. ఆమెకు సçహాయకులుగా పనిచేసిన వారిని కూడా విచారిస్తామన్నారు.
సీఐ ఆవేదన
ఈ కేసు విషయంలో అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేయడం లేదని వారంతా కలసి తనను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సీఐ కిషోర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీకి సిద్ధమయ్యానని, ఈశ్వరమ్మ కేసుతో తమ ఉద్యోగాలకే ఎసరు వచ్చిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment