యూనిట్ టెస్ట్ కోసం పరీక్ష హాల్‌లో కూర్చున్న పదవ తరగతి విద్యార్థినికి ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసు. కానీ గత చాలాకాలంగా ప్రశ్నార్థకంగా మారిన తన జీవితానికి సమాధానం ఏమిటో అంతుచిక్కలేదు. సొంత ఇంట్లోనే సొంత రక్తసంబంధీకుల వల్లే తను ఎదుర్కొంటోన్న అకృత్యాలకు పరిష్కారం ఏమిటో అ అమ్మాయికి అర్థం కాలేదు. అందుకే అన్సర్ షీట్‌లో అసలు ప్రశ్నలకు సమాధానాలకు బదులుగా, గత చాలాకాలంగా తనలో తానే కుమిలిపోతోన్న విషయాన్నంతా రాసేసి గుండెలనిండా ఊపిరిపీల్చుకుంది.
అక్టోబరు 1వ తేదీన ఈ ఘటన జరిగింది. పరీక్షా పత్రాలను దిద్దే సందర్భంలో ఈ దారుణం టీచర్ దృష్టిలో పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని గురుగావ్ జిల్లా బాద్‌షాపూర్‌లో పదవ తరగతి చదువుతోన్న ఈ విద్యార్థినిపై వారి పక్కింట్లోనే ఉండే ఆమె మామయ్య, ఇంటర్‌మీడియట్ చదువుతోన్న ఆమె పిన్ని కొడుకు ఇద్దరూ కలిసి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో విసిగివేసారిన ఈ బాలికకు ఎవరికి చెప్పుకోవాలో, ఈ నరకం నుంచి ఎలా బయటపడాలో పాలుపోలేదు.
దీంతో యూనిట్ టెస్ట్‌లో ఇచ్చిన ఆన్సర్ షీట్‌లో గత కొంతకాలంగా తనుపడుతోన్న వేదననంతా రాసింది. ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలన్నింటినీ ఆన్సర్‌షీట్‌లో పేర్కొంది. స్కూల్ టీచర్ ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తేవడంతో ఆ అమ్మాయి మామయ్య (23)నీ, ఆమె కజిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు పోస్కోకేసు నమోదు చేసారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శకుంతలా యాదవ్ మాట్లాడుతూ.. ఆ బాలిక మామయ్య వాళ్ళ పక్కింట్లోనే ఉంటాడనీ, ఆమె కజిన్ వారి ఇంట్లోనే ఉంటున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment