
నరసాపురం: నరసాపురం పేరు చెప్పగానే సుదూర తీరప్రాంతం.. గోదావరి అందాలు.. అంతర్జాతీయ లేసు అల్లికలు.. రాజకీయ ఉద్దండులు.. సినీ ప్రముఖులు గుర్తుకు వస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే హవాలా వ్యాపారం పేరుతో నరసాపురం మార్మోగిపోతోంది. ఎక్కడెక్కడో అక్రమంగా తరలిస్తున్న డబ్బు సంచులు బయటపడుతున్నా నరసాపురం పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా జీన్‌దత్ జ్యూయలరీ షాపు, దాని యజమాని కీర్తి కుమార్‌జైన్ పేరు తెరమీదకు వస్తోంది. బుధవారం నెల్లూరు జిల్లా తడ వద్ద కారులో తరలిస్తున్న రూ.6.52 కోట్లను పోలీసులు పట్టుకోగా ఈ మొత్తం కీర్తికుమార్ జైన్‌ది కావడం గమనార్హం. కళలు, సాహిత్యం వంటి రంగాల్లో కీర్తి గడించిన ప్రాంతం చట్టవ్యతిరేక వ్యవహారాలతో మారుమోగడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా తడలో పోలీసులు పట్టుకున్న నగదులో విదేశీ కరెన్సీ కూడా భారీగా ఉండటంతో హ వాలా వ్యాపార దందా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల క్రితం బెంగళూరులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అంశంలో కూడా ఇదే వ్యక్తి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది.
సొమ్ములెక్కడదొరికినా.. ఇక్కడే లింకు
2014 ఎన్నికల సమయంలో భీమవరం వద్ద భారీగా నగదును జీన్‌దత్ జ్యూయలరీ షాపు యజమాని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు హవాలా మార్గంలో సొమ్ము సమకూర్చడానికే తరలించినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ కేసు ఈడీ వద్ద ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలోనూ అదే షాపు గుమాస్తాలు కారులో తరలిస్తున్న రూ.7 కోట్లను కరీంనగర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సొమ్ములకు ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు తడలో రూ.6.52 కోట్లు పట్టుబడ్డ వ్యవహారం సంచలనం రేపింది. 2006లో ఇదే షాపునకు బిల్లులు లేకుండా తరలిస్తున్న 20 కిలోల బంగా రం, 500 కిలోల వెండి ఆభరణాలను తూర్పుగోదావరిలో పోలీసులు పట్టుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఎక్కువ సందర్భాల్లో అసలు కేసులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. బిల్లులు పుట్టించి పోలీసులు పట్టుకున్న సొమ్మును తిరిగి తెచ్చుకోవడం హవాలాలో ఆరితేరిన బులియన్ వ్యాపారులకు పెద్ద కష్టం కాదనే వాదన ప్రచారంలో ఉంది.
అసలు ఏం జరుగుతోంది
పాత కారు, అందులో ప్రత్యేక అరలో కోట్ల కొద్దీ డబ్బు కట్టలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే హవాలా వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు సొమ్మును ఎంత పకడ్బందీగా తరలిస్తున్నారో అర్థమవుతుంది. హోల్‌సేల్ బంగారం కొనుగోలును వ్యాపారులు బ్యాంకు డీడీ ద్వారా చేయాలి. అయితే డబ్బు కట్టలతో పట్టుబడుతున్న వారు బంగారం కొనుగోలుకు సొమ్ము తీసుకువెళుతున్నామని చెబుతున్నారు. ఇందులో వాస్తవం లేదనేది అర్థమవుతోంది. అయితే దొంగచా టుగా సినీఫక్కీలో కారులో ప్రత్యేక అర చేయించి సొమ్ము పెట్టడం ఏమిటనే ప్రశ్న తెరమీదకు వస్తుంది. విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే బంగారం వ్యాపారాన్ని అడ్డుగా పెట్టి కొందరు అక్రమ వ్యాపారాలను యథేచ్ఛగా సాగిస్తున్నారని అర్థమవుతోంది. ఇది పోలీసు, ఆదాయశాఖ, కస్టమ్స్ ఇలా అనేక శాఖలకు ముడిపడి ఉన్న అంశం. మరి తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా? ఎలాంటి కేసులు నమోదు కావడం లేదంటే ఆయా శాఖల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వ్యాపారం విస్తరించిందా?
ఇటీవల నోట్ల రద్దు, బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన సవాలక్ష ఆంక్షల నేపథ్యంలో నగదు లభ్యత గగనంగా మారింది. అక్ర మ వ్యాపారాలు సాగించే వారు అన్నీ బ్యాంకు లావాదేవీల ద్వారా సాగించలేని పరిస్థితి. వీరికి పెద్ద మొత్తంలో నగదు అవసరమైనప్పుడు ఇలాంటి హవాలా వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నా, పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చాల్సి వచ్చినా ఇక్కడి హవాలా వ్యాపారులు వ్యవహారాలు నడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల హవాలా వ్యాపారం పరిధి భారీగా పెరిగినట్టు సమాచారం. ఓ వైపు డిజిటల్ కరెన్సీ ఉద్యమం, మరోవైపు ఆర్థిక లావాదేవీల్లో సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల వద్ద కూడా కనిపించనంతగా డబ్బు సంచులు వీరికి ఎలా సమకూరుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment